కరీంనగర్ రూరల్, జూలై 27: గ్రామాల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో ఒకరికి డెంగీ సోకగా బుధవారం ఆమె గ్రామాన్ని సందర్శించారు. పలు ఇండ్ల ఆవరణను పరిశీలించారు. నీటి తొట్టిల్లో పెరిగిన దోమల లార్వాలను సెల్ ఫోన్ ద్వారా గుర్తించారు. గ్రామంలో పారిశుధ్య పనులు సక్రమంగా చేపడుతున్నారా? లేదా అని పంచాయతీ కార్యదర్శిని, సర్పంచ్‌ను అడిగారు.
మురుగు నీటి గుంతల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నారా, మురుగు కాల్వల నిర్వహణ, తాగునీటి సమస్యల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. డెంగీతో బాధపడుతున్న రోహన్ ఇంటికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో మురుగు నీరు నిలిచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో హరితహారంలో ఎన్ని మొక్కలు నాటారని అడుగగా, గుంతల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో ఎక్కువగా నాటలేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మూడు వేల మొక్కలు నాటినట్లు చెప్పగా, వాటిని చూపించాలన్నారు.
దానికి ఎంపీడీవో సంపత్‌కుమార్ చెప్పిన సమాధానాలకు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇంటిని పరిశీలించి, యజమానికి నోటీసులు ఇచ్చి తొలగించాలని ఆదేశించారు. అనంతరం దుర్శేడ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు. తరగతి గదులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. మండలంలో ఎన్ని మొక్కలు నాటారని ఏపీవో శోభను అడుగగా, గుంతల్లో నీరు నిలిచి ఉందని చెప్పడంతో అదనపు కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఏపీవోకు మెమో జారీ చేయాలని డీఆర్డీఏ ఏపీడీ సంధ్యారాణిని ఆదేశించారు.
వసతి గృహం ఆవరణలో అదనపు కలెక్టర్‌తో పాటు డీపీవో వీరబుచ్చయ్య మొక్కలు నాటారు. స్థానిక అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి పిల్లలను పలు ప్రశ్నలు అడిగారు. గ్రామంలో 3, 4వ తరగతి చదివే విద్యార్థుల ఇండ్లకు వెళ్లి బాలామృతం అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్‌కు పిల్లలు వచ్చేలా చూడాలని సర్పంచ్ గాజుల వెంకటమ్మకు సూచించారు.
జడ్పీ ఉన్నత పాఠశాలలో 6, 8వ తరగతి విద్యార్థుల వ్యక్తిగత వివరాలు సేకరించారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం దుర్శేడ్ సబ్ స్టేషన్ వద్ద అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. గ్రామంలో హరితహారంలో భాగంగా ఎన్ని మొక్కలు నాటారని అడుగగా, పంచాయతీ కార్యదర్శి 15 వేలు, ఎంపీడీవో 25 వేలు, ఎంపీవో 20 వేలు నాటినట్లు చెప్పడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
వెంటనే గ్రామాల్లో లక్ష్యం మేరకు హరితహారం మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చామనపల్లి అరుణ, గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచులు సుంకిశాల సంపత్‌రావు, గాండ్ల విజయ, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, మండల విద్యాధికారి మధుసూదన్, ప్రధానోపాధ్యాయుడు రాజమౌళి, పంచాయతీ కార్యదర్శులు హిదాయతుల్లా, పరశురాములు, ఏఈ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.