కార్పొరేషన్, జూలై 27: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ వై సునీల్‌రావు అధికారులను ఆదేశించారు. స్థానిక నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం ఆయన రెవెన్యూ విభాగం అధికారులతో ఆస్తి పన్ను వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం స్కీంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగరంలో ఆస్తి పన్ను వందశాతం వసూలు చేయాలని ఆదేశించారు.
వ్యాపార, వాణిజ్య సంస్థల ఆస్తి పన్ను వసూలు విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం కల్పించిన వన్ టైం సీంను పూర్తిస్థాయిలో అమలు చేసి బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. అక్టోబర్ చివరి వరకు ఈ స్కీంలో 90 శాతం వడ్డీపై మాఫీ పొందే అవకాశం ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించి, పన్ను వసూలయ్యేలా చూడాలన్నారు. వాణిజ్యపరంగా వినియోగించే ఆస్తులను గుర్తించి అందుకు తగిన విధంగా పన్ను విధించాలన్నారు.
నగరంలో అన్ని ప్రాంతాల్లో ఆస్తుల కొలతలను అనుసరించి పన్ను విధించాలని ఆదేశించారు. వ్యాపార సంస్థలు, ఫంక్షన్ హాళ్లు, ఆటో మొబైల్ స్టోర్స్, వివిధ షాపింగ్ కాంప్లెక్స్‌లు, రైస్‌మిల్లులు తదితర వాటిపై చట్టపరంగా పన్ను విధించి వసూలు చేయాలన్నారు. వచ్చే నెల నుంచి నగరంలో బ్లాక్‌ల వారీగా ఆస్తి పన్ను వివరాలపై ఆకస్మికంగా తనిఖీలు చేపడుతామని తెలిపారు.
ఈ తనిఖీల్లో ఆస్తి పన్ను కొలతల్లో ఏమైనా తేడాలు ఉంటే సంబంధిత రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరపాలక సంస్థకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆస్తి పన్ను విషయంలో బల్దియాకు జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వర్, శానిటేషన్ సూపర్వైజర్ రాజమనోహర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.