కలెక్టరేట్, జూలై 27 : పిల్లల్లో పోషణ లోపం లేకుండా పర్యవేక్షిస్తూ అంగన్వాడీ కేంద్రం ద్వారా లభించే అన్ని రకాల సేవలు వారికి అందించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ జాబితా రూపొందించడంపై పోషణ్ అభియాన్ బృందం, సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు బుధవారం నగరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పర్యవేక్షణ జాబితాను ఎప్పటికప్పుడు పూరించి, పారదర్శకత పాటించాలన్నారు. పోషణ్ ట్రాకర్ ఎంట్రీ విధానం, పోషణ్ అభియాన్ సిబ్బంది రోజువారీ చేయాల్సిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ శిబిరంలో బిడ్డ పెరుగుదలను ఎలా చూడాలి? ట్రాకర్‌లో ఎంట్రీ చేసే విధానం? పెరుగుదల పర్యవేక్షణ కార్డులపై పోషణ్ అభియాన్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ భాస్కర్ శిక్షణనిచ్చారు. డీడబ్ల్యూవో వీ పద్మావతి, సీడీపీవోలు సబిత, ఉమారాణి, భాగ్యలక్ష్మి, కస్తూరి, ఐటీ టెక్నికల్ సపోర్టర్ ప్రవీణ్, పోషణ్ అభియాన్ బృందం, ఏసీడీపీవోలు పాల్గొన్నారు.