ఇల్లందకుంట, జూలై 27 : వరిసాగులో మిషన్తో నాటు ఎంతో మేలని, దీంతో కూలీల కొరతను అధిగమించవచ్చని ఏవో గుర్రం రజిత తెలిపారు. మండలంలోని మర్రివాణిపల్లి గ్రామంలో రైతు మర్రి చొక్కారెడ్డి వరి క్షేత్రంలో యంత్రం ద్వారా నాటు వేసే పద్ధతిపై రైతులకు బుధవారం క్షేత్రస్ధాయిలో అవగాహన కల్పించారు.
వ్యవసాయ కూలీల కొరత ఎక్కవగా ఉన్నందున మిషన్ నాటుతో దూరం చేసుకోవచ్చని తెలిపారు. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో వరి సాగు చేయవచ్చని పేర్కొన్నారు. నాటు సాలు పద్ధతిలో మిషన్ నాటడంతో గాలి, వెలుతురు, పోషకాలు మొక్కకు అందుతాయన్నారు.
ఈ సీజన్లో పత్తి, వరి, మక్కజొన్న సాగు చేసుకున్న రైతులు వ్యవసాయ అధికారుల దగ్గర పంటల వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. పంటలు నమోదు చేసుకోకపోతే కొనుగోలు సమయంలో మార్కెట్ ఇబ్బందులు తప్పవన్నారు. ఏఈవోలు మౌనిక, సంపత్, రాకేశ్, మహేందర్, రైతులు ఉన్నారు.