సారంగాపూర్, జూలై 27: భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీ నష్టం జరిగిందని, బాధితులు అధైర్య పడొద్దని, అండగా ఉండి ఆదుకుంటామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. ఇటీవలి వర్షాలకు బీర్పూర్ మండలంలో ఇండ్లు కూలి నష్టపోయిన 26 కుటుంబాలకు బాధిత కుటుంబాలకు 3200 చొప్పున పరిహారాన్ని ఎమ్మెల్యే బుధవారం అందజేశారు. పంచాయతీ కార్యాలయాల్లో చెక్కులను అందజేశారు. 15మందికి కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు చీరలను అందజేశారు.
నలుగురికి 1.26లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంటికి వెళ్లి అందజేశారు. ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రకృతి విపత్తు వచ్చిపడిందని, జులైలోనే ఏడాదికి సరిపడా వర్షాలు కురిశాయన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్తగా నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రోళ్లవాగు ప్రాజెక్ట్ పాత కట్ట తెగిందని, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కొప్పల ఈశ్వర్ కృషితో తక్షణ మరమ్మతులకు ప్రభుత్వం 80లక్షల నిధుల మంజూరుకు హామీ ఇచ్చిందన్నారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని గ్రహించి ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నీతి ఆయోగ్ నిధులు ఇవ్వాలని కేంద్రానికి విన్న వించినా ఒక్కపైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఉపాధి హామీ పనిని పూర్తిగా ఉపయోగించుకున్న రాష్ట్రంగా తెలంగాణకు అవార్డు ఇచ్చి, నిధుల విషయంలో మాత్రం కొర్రీలు పెడుతున్నదని ధ్వజమెత్తారు. కేంద్రం ఉపాధి హామీని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ మసర్తి రమేశ్, కేడీసీసీ జిల్లా డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు కొల్ముల రమణ, పార్టీ అధ్యక్షులు నారపాక రమేశ్, ప్రధాన కార్యదర్శి శీలం రమేశ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మెరుగు రాజేశం, సింగో చైర్మన్ నవీన్ రావు, యూత్ అధ్యక్షుడు గాజర్ల రాంచందర్ గౌడ్, డీఈలు మిలింద్, సత్యనారాయణ, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.