కార్పొరేషన్, జూలై 27: కరీంనగర్‌ను హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా హరితహారంలో భాగస్వాములు కావాలని మేయర్ వై సునీల్‌రావు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ తరఫున ప్రతి డివిజన్లో ఇంటింటికీ ఆరు మొక్కలు అందిస్తామని తెలిపారు.
మొక్కలను నాటి, కంటికి రెప్పలా కాపాడాలని సూచించారు. స్థానిక 33వ డివిజన్లో బుధవారం ఆయన మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో హరితహరం కోసం ప్రత్యేకంగా బల్దియాకు చెందిన 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించినట్లు తెలిపారు. నగర ప్రజలకు ఈసారి రెండున్నర లక్షల మొక్కలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే నగరంలో రోడ్లకు ఇరువైపులా, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి యాదాద్రి, బ్లాక్, అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటామన్నారు. ఈసారి కూడా శివారు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
నగరంలో చేపట్టే హరితహారం కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటి ఎదుట పెట్టే మొక్కలను తమ పిల్లల వలే సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు గొప్ప ఆస్తిని అందించినట్లే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, నగరపాలక సంస్థ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలందించాలని మేయర్ యాదగిరి సునీల్ రావు పారిశుధ్య ఎస్ఐలు, జవాన్లను ఆదేశించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం ఆయన పారిశుధ్య విభాగం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో ట్రేడ్ లైసెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
నగర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేపట్టి షాపుల వివరాలను సేకరించి 15 రోజుల్లో అందించాలన్నారు. నిబంధనలు ప్రకారం షాపులో యజమానులతో ట్రేడ్ లైసెన్స్ కట్టించాలని ఆదేశించారు. నగర వ్యాప్తంగా దుకాణాల వివరాలను సేకరించి, బల్దియా ఆదాయం పెంచే విధంగా ఎస్ఐలు జవాన్లు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, దవాఖానలు, షాపింగ్ కాంప్లెక్స్ లాంటి వ్యాపార సంస్థల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఆదేశించారు.
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వర్షపు నీటిని తొలగించాలన్నారు. విషజ్వరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసి, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. వాటికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను నగర వ్యాప్తంగా డోర్ టు డోర్ అతికించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వర్, శానిటేషన్ సూపర్వైజర్ రాజ మనోహర్ పాల్గొన్నారు.