ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులకు దారి చూపిన ఆయన.. విరమణ అనంతరం సైతం విజ్ఞానాన్ని పంచుతున్నారు. తన ఇంటిపైనే లక్ష పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పోటీ పరీక్షలకు అవసరమయ్యే బుక్స్‌తో పాటు సాహిత్యం. ప్రముఖులు రచించిన గ్రంథాలు, తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృత భాషల్లోని పుస్తకాలు. వార్తాపత్రికలు అందుబాటులో ఉంచారు. కాంపిటేటీవ్ ఎగ్జామ్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రిపరేషన్‌పై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వేములవాడకు చెందిన వీరగోని ఆంజనేయులుగౌడ్పై ప్రత్యేక కథనం..
వేములవాడ, జూన్ 25 : వేములవాడలోని రాజీవ్‌నగర్‌కు చెందిన వీరగోని ఆంజనేయులుగౌడ్ సుదీర్ఘకాలం ఇంగ్లిష్ టీచర్‌గా పచిచేసి 2009లో విరమణ పొందాడు. అయితే తన శేష జీవితంలో సైతం విజ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశ్యంతో తన ఇంటిపైనే గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశాడు. చిన్న నాటి నుంచే పుస్తకాల సేకరణ అలవాటు ఉన్న ఆయన ఇప్పటివరకు దాదాపుగా లక్ష పుస్తకాలు, 200 రకాల వార్తా పత్రికలను సేకరించి పాఠకులకు అందుబాటులో ఉంచాడు. ప్రస్తుతం ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు గ్రంథాలయంలోని చరిత్ర, ఇతర పుస్తకాలను అందిస్తూ సలహాలు సూచనలు చేస్తున్నాడు.
ఆంజనేయులుగౌడ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు ఇలా నాలుగు భాషల్లో పుస్తకాలు, వార్తపత్రికలను అందుబాటులో ఉంచాడు. ఇందులో తాళపత్ర గ్రంథాలు, వేదాలు, భారతం, భాగవతం, రామయణం, భగవద్గీతతో పాటు బైబుల్, ఖురాన్, జైనా, బౌద్ధ, సిక్కు, వేదాలు, ఉపనిషత్తులు ఇలా 18రకాల మత పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖుల జీవిత చరిత్రలు, నాటకాలు, పద్యాలు, పద్యభాగం, కవితలు, చరిత్ర, ఆర్థికశాస్త్రం, 5రకాల వైద్యవిధాన పుస్తకాలను సైతం పాఠకులకు అందిస్తున్నాడు. దిన, వార, పక్ష, మాస, త్రైమాసికతో కూడిన నాలుగు భాషల 200రకాలకు పైగా పత్రికలు గ్రంథాలయంలో సిద్ధంగా ఉన్నాయి.
ఇంటిపైనే ప్రత్యేకంగా రెండు గదులను నిర్మించి గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు తెరిచి ఉంచుతారు. పుస్తకప్రియులు, ఇతర పోటీపరీక్షలకు హాజరయ్యే యువతీయువకులు వచ్చి అవసరమున్న వాటిని తీసుకొని నిత్యం చదువుకుంటున్నారు. వారడిగే సందేహాలను నివృత్తి చేస్తున్నాడు. సుమారు 30 మంది పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు ఇక్కడికి వస్తున్నారని ఆంజనేయులు చెబుతున్నాడు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాను. కాంపిటేటివ్ బుక్స్ కోసం ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాను. ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ చరిత్ర, ఇతర పుస్తకాలు సైతం అందుబాటులో ఉంచారు.
-హారికరెడ్డి, వేములవాడ
పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటికి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. గ్రంథాలయంలో మంచి సౌకర్యాలతో పాటు అనేక పుస్తకాలు కూడా ఉన్నాయి. విధులు ముగించుకున్న తర్వాత ప్రతిరోజు సాయంత్రం వచ్చి చదువుకుంటున్నాను. అవసరం ఉన్న పుస్తకాలన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
-కన్నం అనిల్, పంచాయతీ కార్యదర్శి (సనుగుల)
చిన్ననాటి నుండే పుస్తకాల సేకరణపై ఆసక్తి ఉంది. సేకరించిన పుస్తకాలను నలుగురు చదవాలని ఇంటిపైనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాను. ఇప్పటివరకు లక్ష పుస్తకాలు సేకరించా. ఉద్యోగాలకు సిద్ధమయ్యే యువతి యువకులు కూడా ప్రతిరోజు వస్తున్నారు. చదువుకునే పిల్లలు కూడా వస్తుంటారు. వారికి వస్తున్న సందేహాలను తీరుస్తున్నాను.
-వీరగోని అంజనేయులు, విశ్రాంత ఉపాధ్యాయుడు (వేములవాడ)