హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ పబ్లిక్ సూల్ సొసైటీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్న ఉత్తర్వుల అమల్లో జాప్యం జరుగడంతో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ పబ్లిక్ సూల్ సొసైటీలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీంతో దర్యాప్తు జరిపి 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశించింది.
అయినప్పటికీ ఆ ఆదేశాలు అమలు కాలేదంటూ డీ రవీందర్ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విద్యాశాఖ కార్యదర్శికి నోటీసులు జారీచేసి, విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.