వీణవంక, జూన్ 25: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా శాఖల అధికారులు మూడు నెలలుగా మండలంలో జరిగిన అభివృద్ధి పనుల నివేదికను చదివి వినిపించారు. వల్భాపూర్, వీణవంక, మామిడాలపల్లి, రెడ్డిపల్లి, కనపర్తి, బేతిగల్ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు సభా దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోనే అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలన్నారు. గ్రామంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మామిడాలపల్లి సర్పంచ్, ఘన్ముక్ల ఎంపీటీసీ అడిగిన పాఠశాలల్లో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
స్వచ్ఛతలో దేశంలోనే మండలంలోని రామకృష్ణాపూర్‌కు 4వ స్థానం రావడం, చల్లూరు పీహెచ్సీ జాతీయ అవార్డుకు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేసి, వారికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మండలానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు రూ.26,03,016 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు హమీద్, ఎంపీడీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.