కరీంనగర్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ సహకార బ్యాంకు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, వరుసగా ఎనిమిది సార్లు జాతీయ స్థాయి అవార్డులు సాధించి సహకార వ్యవస్థకు దిక్సూచిగా మారిందని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని బ్యాంక్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సహకార బ్యాంకు సాధించిన ప్రగతిని వివరిస్తూ మంచి లాభాలను ఆర్జించిందని చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 6,500 కోట్ల నుంచి 7,300 కోట్లకు తమ వ్యాపారాన్ని పెంచుకొని 12.40 శాతం వృద్ధిని సాధించామని, 800 కోట్ల వ్యాపారం పెరిగిందని వివరించారు. డిపాజిట్లు 2,530 కోట్ల నుంచి 2,850 కోట్ల డిపాజిట్లు సేకరించి 12.60 శాతం వృద్ధిని సాధించామన్నారు. 3,972 కోట్ల నుంచి 4,458 కోట్లకు రుణాలు పెంచి 12.20 శాతం వృద్ధిని సాధించామని చెప్పారు. షేర్ క్యాపిటల్ 188.68 కోట్ల నుంచి 216.12 కోట్లకు పెరిగిందన్నారు. ఇక రుణాల విషయాన్ని వివరిస్తూ 1,515 కోట్ల పంట రుణాలు, 288 కోట్ల దీర్ఘ కాలిక రుణాలు, 152 కోట్ల గృహ రుణాలు, 61 కోట్ల విద్యా రుణాలు, 223 కోట్ల మహిళా స్వశక్తి రుణాలు ఇచ్చామని, 98 శాతం రివకరి సాధించామని, స్థూల ఎన్పీఏ శాతం 0.73 నుంచి 0.54 శాతానికి తగ్గిందని చెప్పారు.
18 బ్యాంకు శాఖలు వంద శాతం రికవరీ చేశాయని, మరో 4 శాఖలు 98 శాతం రికవరీ చేశాయని, స్థూల లాభం 100 కోట్ల నుంచి 119 కోట్లకు పెరిగిందని, బ్యాంకు పరిధిలో 131 సంఘాలు ఉండగా 128 సంఘాలు లాభాల్లో ఉన్నాయన్నారు. సహకార సంఘాల పరిధిలో 60 వేల నుంచి 70 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాములను సమకూర్చుకున్నామని తెలిపారు. బ్యాంకులో యూపీఐ మొబైల్ యాప్, ఐఎంపీఎన్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ సేవలు కూడా అందిస్తున్నామని చెప్పారు. కమర్షియల్ బ్యాంకులతో సమానంగా పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై, బీమా వంటి సదుపాయాలు సమకూర్చుతున్నామని, అన్ని శాఖల్లో సేఫ్ లాకర్ల సదుపాయం ఉన్నదని వివరించారు.
ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను మరింతగా పెంచుకున్నామని రవీందర్రావు వివరించారు. 3,600 కోట్ల డిపాజిట్లు సేకరించాలని, 5,400 కోట్ల రుణాలు అందించాలని, 9 వేల కోట్ల వ్యాపారం పెంచుకోవాలని పాలకవర్గం నిర్ణయించిందని, అలాగే 600 కోట్ల పంట రుణాలు, 350 కోట్ల దీర్ఘకాలిక రుణాలు, 300 కోట్ల మహిళా స్వశక్తి రుణాలు, 175 కోట్ల గృహ రుణాలు, 75 కోట్ల విద్యా రుణాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 5 ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో 2.90 కోట్లతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అందుకోసం కోసం నాలుగెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిన పెద్దపల్లి కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా ప్రోత్సహించాలని మిగతా జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే అవకాశాన్ని ఇవ్వాలని రవీందర్రావు కోరారు. కొన్ని జిల్లాల్లో ప్రత్యేకించి సిరిసిల్లలో ధాన్యం సేకరించే బాధ్యతల నుంచి సహకార సంఘాలను తప్పిస్తున్నారని, మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా ఇలాంటి చర్యలే జరుగుతున్నాయని, ఇది సరైన నిర్ణయం కాదన్నారు. సహకార వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయకోణం చూడరాదని విజ్ఞప్తి చేశారు. గత పద్నాలుగేండ్ల నుంచి సహకార సంఘాలు ధాన్యం సేకరిస్తున్నాయని, అప్పుడు మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు ఈ ప్రతిపాదన చేశారని, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ విధానాన్ని ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశ విదేశాల నుంచి వచ్చి మన సహకార వ్యవస్థను స్టడీ చేసి వెళ్తున్నారని, అక్కడ మన విధానాలను అమలు చేస్తూ అభివృద్ధిని సాధిస్తున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం అందిస్తే మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని అన్నారు. సమావేశంలో బ్యాంకు ఉపాధ్యక్షుడు పింగలి రమేశ్, డైరెక్టర్లు సీఈవో సత్యనారాయణ రావు, డైరెక్టర్లు ఉచ్చిడి మోహన్ రెడ్డి, సింగిరెడ్డి స్వామిరెడ్డి, శ్రీగిరి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.