కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 2 : కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానున్నది. నామినేషన్ల ప్రక్రియ కూడా నేటి నుంచే ప్రారంభమవుతుంది. కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుండగా, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశారు. సోమవారం నుంచి మొదలుకానున్న నామినేషన్ల పర్వం ఈనెల 10వ తేదీ వరకు కొనసాగనున్నది. 11న పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ పమేలా సత్పతి వ్యవహరించనుండగా, నామినేషన్లు స్వీకరించేందుకు కలెక్టరేట్ చాంబర్లో అన్ని ఏర్పాట్లూ చేశారు.
ప్రభుత్వ పనిదినాల్లో ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ పత్రాలు పూరించడంలో అనుమానాలు తొలగించేందుకు కలెక్టరేట్లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్ హాలులో పట్టభద్రుల, ఉపాధ్యాయ మండలి నామినేషన్ పత్రాలు పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారికి సమర్పించేలా తగిన సూచికలు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు అవసరమైన అధికారులను కూడా ఎంపిక చేసి, వారికి శిక్షణ కూడా ఇచ్చారు. 70 మంది వరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 8.30 గంటలకే సంబంధిత అధికారులతో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ట్రయల్ నిర్వహించనున్నట్లు సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 27న జరుగనున్న పోలింగ్‌లో పాల్గొనేందుకు అర్హుల తుది జాబితా ఇప్పటికే విడుదలైంది.
పట్టభధ్రుల సెగ్మెంట్‌కు సంబంధించి 3,58,614 మంది, 28,872 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 271 మండలాల్లో 499 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసిన నాటి నుంచే అభ్యర్థుల ప్రచారం, వాహనాల అనుమతులు, వారు చేసే ఖర్చులపై నిఘా ఉండనున్న దృష్ట్యా, సంబంధిత తనిఖీ బృందాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇవి నేటి ఉదయం 11 గంటల నుంచి రంగంలోకి దిగనున్నాయి. కాగా, సోమవారం వసంతపంచమి కావడంతో మొదటిరోజు పలు పార్టీల మద్దతుతో బరిలోకి దిగబోతున్న పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశాలున్నాయి.