మంత్రి గంగుల కమలాకర్ అంటే అభివృద్ధికి తారక మంత్రం. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ఆయన, కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన గంగుల నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించి, అధికార బీఆర్ఎస్ పక్షాన మరోసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే రూ.2,500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఆయన.. మరోసారి గెలిచి ఈ అభివృద్ధిని కొనసాగిస్తామని చెబుతున్నారు. మానేరుపై నిర్మించిన కేబుల్ వంతెనతో జిల్లా ఖ్యాతి దేశ వ్యాప్తంగా ఇనుమడించిందని, మానేరు రివర్ ఫ్రంట్ పూర్తి కాగానే కరీంనగర్‌కు ప్రపంచ స్థాయిలో ఖ్యాతి వస్తుందని అంటున్నారు. ఐటీ ఉద్యోగాలను మెరుగు పర్చడం, 2 వేల మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీని జిల్లాకు తీసుకురావడం, కరీంనగర్లో 24 గంటల నీటి సరఫరా చేయడం తన భవిష్యత్ లక్ష్యాలని వివరించారు. ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు..
– కరీంనగర్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): దశాబ్ద కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని.. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే మళ్లీ గెలిచి అభివృద్ధిని కొనసాగిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.2,500 కోట్లతో నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని చెబుతున్న ఆయన, మానేరు రివర్ ఫ్రంట్‌తో కరీంనగర్‌కు ప్రపంచ ఖ్యాతి దక్కుతుందని తెలిపారు. ఐటీ ఉద్యోగాలను మెరుగు పర్చడం, రెండు వేల మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీ తేవడం, నగరంలో 24 గంటల పాటు మంచినీళ్లు సరఫరా చేయడం తన భవిష్యత లక్ష్యాలని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన అభివృద్ధి, ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే చేయబోయే ప్రగతి లక్ష్యాలను వివరించారు.
నమస్తే : మీ రాజకీయ ప్రస్థానం గురించి చెబుతారా..?
మంత్రి గంగుల : నేను రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చా. 2000లో మున్సిపల్ కౌన్సిలర్‌గా, 2005లో మున్సిపల్ కార్పొరేటర్‌గా గెలిచా. ఆ సమయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, టీడీపీ పట్టణ శాఖ అధ్యక్షుడిగా పనిచేశా. 2009లో టీడీపీ నుంచి మొదటిసారి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచా. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నది. ఆ సమయంలో ఉద్యమంలో పాల్గొనకుండా టీడీపీ ఆటంకాలు సృష్టించింది. దాంతో నేను 2013లో ఆ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో చేరాను. కేసీఆర్ నాయకత్వంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నా. 2014లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాకు మరోసారి పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. అప్పుడు ప్రజల మన్ననలతో రెండోసారి గెలిచా. ఆ సమయంలో అనేక అభివృద్ధి పనులు సాధించా. 2018లో మరోసారి బీఆర్ఎస్ పక్షాన పోటీ చేసి గెలిచా. అభివృద్ధిపై నాకున్న తపనను గుర్తించిన కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థవంతంగా పనిచేస్తున్నా.
నమస్తే : ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎన్ని కోట్లతో అభివృద్ధి చేశారు?
గంగుల : దాదాపు 2,500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. అందులో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంతోపాటు మెడికల్ కాలేజీకి ప్రాముఖ్యత ఇచ్చాం. ముస్లింలకు ఈద్గా భూమిని కేటాయిస్తున్నాం. ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి కూడా భూమి ఇస్తున్నాం. కరీంనగర్ ప్రజలకు అభివృద్ధి, ఆధ్యాత్మికం, ఆహ్లాదకమైన వాతావరణం అందించాలనేదే మా లక్ష్యం. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావల్సిన అవసరమున్నది. ప్రజలు మా పక్షాన ఉన్నారు. మళ్లీ గెలుస్తాం. అభివృద్ధిని కొనసాగిస్తామనే నమ్మకం మాకు ఉన్నది. రాష్ట్రంలోనే బీసీ రెసిడెన్షియల్ అగ్రికల్చర్ కళాశాల రెండోది కరీంనగర్‌కు తెచ్చాం. దీనిని 45 ఎకరాల్లో నిర్మిస్తున్నాం.
నమస్తే : భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఏమైనా మిగిలి ఉన్నాయా..?
గంగుల : ఇంకా కొన్ని ఉన్నాయి. కరీంనగర్ నగర పాలక సంస్థలో ఇప్పటికే ప్రతి రోజు నీళ్లు ఇస్తున్నాం. 24 గంటలు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇది అత్యంత ప్రాధాన్యతగల అంశం. నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ టవర్ అభివృద్ధి చేయాల్సి ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఒక పెద్ద ఇండస్ట్రీని ఇక్కడికి తేవాలనే ఆలోచనలో ఉన్నా. ఈ ఇండస్ట్రీలో రెండు నుంచి మూడు వేల మందికి ఉపాధి కల్పించాలనేది నా లక్ష్యం. ఈ సారి ఇండస్ట్రీని ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తా.
నమస్తే : నాలుగోసారి పోటీలో ఉన్నారు కదా! మీ ఫీలింగ్ ఏమిటి?
గంగుల : సీఎం కేసీఆర్ నాకు గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసేందుకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి నాలుగో సారి పోటీ చేసే అవకాశం దక్కింది. చాలా గొప్ప అనుభూతిని ఫీలవుతున్నా. నియోజకవర్గ ప్రజలకు సేవలందించే భాగ్యం దక్కిందని భావిస్తున్నా. ముఖ్యంగా కేసీఆర్ నా మీద ఉంచిన నమ్మకానికి దక్కిన అవకాశం అనుకుంటున్నా. ఎక్కడ కూడా రాజీ పడకుండా ఆయన ఆశయాలు, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్తా.
నమస్తే : మీరు ఇచ్చే ప్రధానమైన హామీలు ఏమైనా ఉన్నాయా..?
గంగుల : ముఖ్యంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాతి నుంచి నియోజకవర్గంలో ఊహించని రీతిలో అభివృద్ధి జరుగుతున్నది. నేను ముందే చెప్పినట్లు ఈ అభివృద్ధి కొనసాగాలి. దొంగ మాటలు చెప్పేవాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఓట్ల కోసం డ్రామాలడే వాళ్లకు అవకాశం ఇస్తే అభివృద్ధి కొనసాగే పరిస్థితి ఉండదు. నా నియోజకవర్గ ప్రజలకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే మరోసారి ఆశీర్వదిస్తే ఇంతకన్నా అద్భుతమైన పనులు చేసి చూపిస్తా. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే కాకుండా నగరాన్ని రాష్ట్రంలోనే రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.
నమస్తే : నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం ఏ విధంగా ఉంది?
గంగుల : బీఆర్ఎస్ కార్యకర్తలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి కార్యకర్త నాతో సన్నిహితంగా ఉంటారు. కార్యకర్తల మధ్య నేనో కార్యకర్తగా ఉంటాను. నేను ఎమ్మెల్యేను, మంత్రిని అని ఎన్నడూ ఫీల్ కాలేదు. కార్యకర్తలే నాకు కొండంత బలం. వారికి ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునేందుకు ముందుంటా. 24 గంటలు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా. కార్యకర్తల్లోగానీ, ద్వితీయ శ్రేణి నాయకుల్లోగానీ ఎక్కడా నాపైగానీ, పార్టీపైగానీ అంసతృప్తి అనే మాట ఇంత వరకు రాలేదు. భవిష్యత్తులో కూడా రాదు. పార్టీ బలం విషయానికి వస్తే నియోజకవర్గంలో పార్టీకి 80 శాతం బలం బీఆర్ఎస్కే ఉంది. ఇది నేను చెప్పే విషయం కాదు. ప్రతిపక్ష పార్టీలు చేయించుకున్న సర్వేలో తేలిన విషయాలు. కరీంనగర్ అసెంబ్లీలో సమీప భవిష్యత్తులో ఇంకో పార్టీకి అవకాశం దక్కే చాన్స్ లేదు. నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు, విచక్షణ కలిగిన వాళ్లు. రాజకీయాలను పక్కన బెట్టి అభివృద్ధి చేసేదెవరో..? అభివృద్ధిని పక్కన బెట్టి రాజకీయాలు చేసేదెవరో ప్రజలకు తెలుసు. నేను ఎన్నికల వరకే రాజకీయాలను నమ్మే వ్యక్తిని. ఆ తర్వాత నా దృష్టంతా అభివృద్ధిపైనే ఉంటది. ఈ పది పదిహేనేండ్లలో కరీంనగర్లో ఇది రుజువైంది. కాబట్టి ప్రజలు ఎప్పుడు అభివృద్ధిని కోరుకునే నాయకున్నే ఎన్నుకుంటరనే విశ్వాసం నాకున్నది.
నమస్తే : మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తారా?
గంగుల : ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన కరీంనగర్‌ను రాష్ట్రం వచ్చిన ఈ పదేళ్లలోనే ఊహించని రీతిలో అభివృద్ధి చేశాం. ఇదంతా కండ్ల ముందు కనిపిస్తున్నది. ఎవరు కాదన లేనిది. గతంలో గ్రామాల మధ్య రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఇప్పుడు అన్ని గ్రామాల మధ్య కనెక్టివిటీ రోడ్స్ డెవలప్ చేశాం. ఇంటర్నల్ రోడ్లు కూడా 70 నుంచి 80 శాతం పూర్తి చేశాం. స్మార్ట్ సిటీతోపాటు సీఎం అస్యూరెన్స్ స్కీం కింద వచ్చిన ప్రతి పైసా కరీంనగర్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నాం. కరీంనగర్లో ఒకప్పుడు ఎక్కడ చూసినా చిధ్రమైన రోడ్లు, రోడ్ల పక్కన మరుగు గుంతలు, గుంపులు గుంపులుగా పందులు కనిపించేవి. ఇప్పుడు నగరంలో ఎటు వెళ్లి చూసినా అద్దంలాటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, అందమైన చౌరస్తాలు కనిపిస్తాయి. ఎక్కడ కూడా పందుల జాడ కనిపించదు.
నమస్తే : రివర్ ఫ్రంట్ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?
గంగుల : కరీంనగర్ నియోజకవర్గం పూర్తిగా అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతం. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమంతోపాటు నగర ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలనే లక్ష్యంతో మానేరు పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. దీని వెనక సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం చాలా ఉంది. 850 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పూర్తయింది. వచ్చే జనవరి వరకు మానేరు రివర్ ఫ్రంట్ పనులు కూడా పూర్తి చేస్తాం. దీనిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. అధికారులతో కలిసి విదేశాల్లో ఉండే ఫౌంటేన్లను కూడా చూసి వచ్చాం. ప్రంపంచలో మూడో స్థాయి ఫౌంటేన్ ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలో మానేరు రివర్ ఫ్రంట్‌లో నీళ్లు ఆపే ప్రయత్నం చేస్తాం. ఫౌంటేన్ పనులు కూడా నడుస్తున్నాయి. మనకు 24టీఎంసీల వాటర్ బాడీ అందుబాటులో ఉంది. దీనిని సద్వినియోగం చేసుకొని మానేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ పూర్తయితే గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుంది. కరీంనగర్ ఖ్యాతి ప్రపంచ స్థాయిలో ఇనుమడిస్తుంది.
నమస్తే : సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉన్నది?
గంగుల : బ్రహ్మాండంగా అమలవుతున్నాయి. అర్హులై ఉంటే చాలు. పైరవీ చేయాల్సిన పని లేదు. రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతున్నది. ఆసరా పింఛన్లు మొదలుకుని కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్, దళిత బంధు, నిన్నామొన్నటి బీసీ బంధు వరకు ఎక్కడ కూడా పైరవీలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ఎన్ని ఉండె? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. దివ్యాంగులకు పింఛన్ 4,016కు పెంచి సీఎం కేసీఆర్ మరోసారి గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నారు. బీసీల్లోని కులవృత్తుల వారికి, మైనార్టీలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, దళితులకు 10 లక్షల ఆర్థిక సహాయం, రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లిస్ట్ ఒడిచేది కాదు. కానీ, అర్హులకే అందించాలనే మా లక్ష్యం ఫర్ఫెక్ట్గా అమలవుతున్నది.
నమస్తే : మీరు ఏయే అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు?
గంగుల : అభివృద్ధి చేశాం. మరోసారి ఆశీర్వదిస్తే భవిష్యత్తులో మరింత అద్భుతంగా చేస్తాం. అదే నా నినాదం. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో ప్రబలంగా నిలిచిపోయాయి. గతంలో ఏ ఎమ్మెల్యే లేనివిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ప్రజల్లో ఒకడిగా ఉండి వాళ్ల కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటున్నా. వాళ్లలో ఒకడిగా ఉంటున్నా. ఏ సమయంలో ఫోన్ చేసినా నా పీఏలో.. గన్మెన్లో ఎత్తరు. నేనే ఎత్తి మాట్లాడుతా. వాళ్ల కష్టమేందో తెలుసుకుంటా. పరిష్కరించే ప్రయత్నం చేస్తా. ప్రజల నుంచి వచ్చిన వాన్ని, ప్రజల కోసమే పనిచేస్తా. కేసీఆర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా. నియోజకవర్గాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతా. ఇవే నా నినాదాలు. మీరు ఒకసారి చూడండి.. పది పదిహేనేండ్లుగా కరీంనగర్ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్య రాలేదు. శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. మరోసారి నా గెలుపుకు దోహదపడే అంశాల్లో ఇవి చాలు.