కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 11 : సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ముందు కరీంనగర్ వాసులకు కనువిందు చేసేలా మూడు రోజుల పాటు నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ‘కరీంనగర్ కళోత్సవాలు’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం స్థానిక ప్రతిమ మల్టీప్లెక్స్‌లో ఆవిష్కరించి, విలేకరులతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రైవేటు సంస్థల స్పాన్సర్‌తో ఈ ఉత్సవాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కవులు, కళకారులకు, సాహిత్తవేత్తలకు పుట్టినిల్లు అయిన కరీంనగర్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ఉత్సవాలు ఉంటాయని తెలిపారు. బహుభాషాకోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, సాహితీవేత్త సీ నారాయణరెడ్డి, జానపద బ్రహ్మ మిద్దె రాములు వంటి ఎందరో మహనీయులు ఇక్కడి నుంచే వచ్చారని గుర్తు చేశారు. ఈ నెల 30, అక్టోబర్ 1, 2 తేదీల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉత్సవాలు ఉంటాయన్నారు. దేశంలోని 29 రాష్ర్టాల నుంచి అక్కడి సంప్రదాయాలను చూపించేలా జానపద బృందాలు వస్తున్నాయన్నారు.
ప్రతి బృందంలో 15 నుంచి 18 మంది కళాకారులు ఉంటారని పేర్కొన్నారు. అలాగే, అండమాన్ నికోబార్, మలేషియా, సింగపూర్, మారిషస్, ఇజ్రాయిల్ నుంచి కళాకారుల బృందాలు వస్తున్నాయన్నారు. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 30 నుంచి 35 కళాబృందాలు, రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 33 బృందాలు వస్తున్నాయని తెలిపారు. ఈ వేడుకలను తార ఆర్ట్స్ అకాడమీ అనుసంధానం ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్, అక్టోబర్ 1న వేడుకలకు సినీనటుడు విజయ్ దేవరకొండ, అక్టోబర్ 2న జరిగే ముగింపు వేడుకలు మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని తెలిపారు. వీరితో పాటు సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, చంద్రబోస్, రోజా రమణి, రమ్యకృష్ణ వంటి ఎందరో ప్రముఖులు వస్తున్నారని తెలిపారు. మన ప్రాంతానికి చెందిన సినీ, టీవీ నటులు, యాంకర్లను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ముగింపు సందర్భంగా కళాకారులందరితో నగరంలో కార్నివాల్ (శోభాయాత్ర) నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్స్ యజమానులతో మాట్లాడి ఫుడ్ పెస్టివల్ ఉండేలా చూస్తామన్నారు. అతి త్వరలోనే రోజువారీ కార్యక్రమాల వివరాలను విడుదల చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ వై సునీల్‌రావు, సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.