Peddapally | ముత్తారం, జూన్ 12: జూన్ మొదటి వారంలో వర్షాలు పడకపోవడంతో వర్షాలు కురిపించు వరుణదేవుడా అని వేడుకుంటూ మండలంలోని సీతంపల్లి గ్రామంలో గురువారం కప్పతల్లి ఆటలు ఆడారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా కప్పతల్లి ఆట ఆడారు. సంచిలో కప్పలను కట్టి రోకలికి తగిలించి డప్పుచప్పుల్లతో గ్రామంలో ఇంటింటికి తిరిగారు. ఇండ్ల వద్దకు వచ్చిన వారికి ప్రతీ ఒక్కరూ బిందెలతో నీళ్లు పోస్తూ వరుణుడు కరుణించాలని వేడుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతకాలంలో వానలు కురువాలంటే పెద్దలు ఈ కప్పతల్లి ఆట ఆడేవారని వరుణుడు కనికరించి వర్షాలు కురిసేవని అన్నారు. అదే పద్ధతిని ఇప్పుడు పాటిస్తున్నామన్నారు. ఆట ఆడిన సాయంత్రం చిరు జల్లులు పడడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య, కురాకుల ఓదేలు, గంగుల రాజలింగు, రాజ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.