విద్యానగర్, జనవరి 21: కంటి వెలుగు శిబిరాలను ప్రతి రోజు పర్యవేక్షించి, సమస్యలను గుర్తించి పరిషరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతితో కలిసి కంటి వెలుగు కార్యక్రమంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈనెల 19, 20వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కంటి వెలుగు శిబిరాల వివరాలు వైద్య శాఖ అధికారులు వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కలెక్టర్లను, సంబంధిత అధికారులను అభినందించారు. ప్రతి రోజు కంటి వెలుగు క్యాంపుల సమాచారం అప్డేట్ చేయాలని, జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు పర్యటించాలన్నారు. కలెక్టర్లు సదరు బృందాల ఫీడ్ బ్యాక్ తీసుకొని మరింత మెరుగ్గా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న బఫర్ బృందాలతో జర్నలిస్టులు, ఉద్యోగులు, పోలీసులు, కోర్టు సిబ్బంది, వివిధ వర్గాల వారికి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో రాబోయే 15 రోజుల్లో బఫర్ బృందాల ద్వారా ప్రత్యేక వర్గాల కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన షెడ్యూల్ తయారు చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో పకాగా ట్యాబ్ ఎంట్రీ వివరాలు నమోదు చేయాలని, ప్రతి రోజూ ట్యాబ్ ఎంట్రీ పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ బృందాల ద్వారా ప్రతి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకొని చిన్న, చిన్న లోటు పాట్లను పరిషరించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న రీడింగ్ కళ్లద్దాల స్టాక్‌ను కలెక్టర్లు ప్రతి రోజూ పర్యవేక్షించాలని, అవసరమైన కళ్లద్దాల స్టాక్ వివరాలు పాయింట్ల వారీగా ముందుగా సమాచారం అందిస్తే జిల్లాలకు సకాలంలో సరఫరా చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 2 రోజుల్లో 11842 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 2454 మందికి రీడింగ్ కళ్లద్దాలను అందించామన్నారు. దృష్టి లోపం అధికంగా ఉన్న 2038 మంది కోసం కళ్లద్దాలను ఆర్డర్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో డాటా ఎంట్రీలో సమస్యలు ఉత్పన్నం కాకుండా సిబ్బందికి మరోసారి అవగాహన కల్పించాలన్నారు. క్యాంపు నిర్వహించే కేంద్రాల్లో జనాభా ఆధారంగా కనీసం 60 శాతం రీడింగ్ కళ్లద్దాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీవో ప్రత్యేక దృష్టి సారించాలని, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేలా చూడాలన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, మెప్మా పీడీ రవీందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, మున్సిపల్ కమిషనర్లు, కంటి వెలుగు ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.