Deputy Collector | కాల్వ శ్రీరాంపూర్, డిసెంబర్ 29 : కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వర్‌రావుకు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పించింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన జగదీశ్వర్ రావు 10వతరగతి వరకు అదే పాఠశాలలో చదివారు. 1997 డీఎస్సీ లో ఎంపికై కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేశారు. కొన్నాళ్ల పాటు ఎంపీడీవో విధులు నిర్వహించారు. అనంతరం గ్రూప్-2లో ఎంపికై నాయబ్ తహసీల్దార్ గా పని చేశారు.
పెద్దపల్లి కలెక్టరేట్ లో పని చేస్తున్న జగదీశ్వర్‌రావు ఫిబ్రవరి 2025లో కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ గా బదిలీపై వచ్చి విదుల్లో చేరారు. అనంతరం గ్రామాల్లోని పలు భూ సమస్యలను పరిష్కరించి, ప్రజల మన్ననలు పొందారు. రెవెన్యూశాఖలో పని చేస్తూనే పలు రచనలు చేశారు. లిటిల్స్ (బైలింగ్వల్) పుస్తకాన్ని తెలుగు, ఇంగ్లీష్ లో రచించారు. అంతే కాకుండా చిలుక సహాయం, మై ట్రస్ట్ విత్ నైటింగేల్, వంటి రచనలు చేశారు. లిటిల్స్ పుస్తకాలను కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేశారు. ఆయన చేసిన సేవలను, వృత్తి నిబద్ధతను, డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, తహసీల్దార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు.