మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 7: మోసపూరిత వాగ్దానాలు, దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో బొంద పెట్టాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలన్నీ వచ్చే మార్చి నెలలో అమలు చేయకుంటే నిరాహార దీక్ష చేపడుతానని, ప్రజలందరూ మద్దతు తెలుపాలని కోరారు.
శనివారం పట్టణంలోని 4, 11, 12,15, 19, 21, 23, 24, 25, 26 వార్డులలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో కలిసి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. మున్సిపల్ ఎన్నికల్లో విద్యావంతులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. కారు హవా తట్టుకోలేక మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, లక్ష్మణ్‌కుమార్ చక్కర్లు కొడుతున్నారని, ఎన్ని చక్కర్లు కొట్టి ఓట్ల కోసం ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ప్రజలు కాంగ్రెస్సోళ్లను నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రజలు కారుకే ఓటేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.
మెట్పల్లి మున్సిపల్‌పై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరాలంటే అన్ని వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇక్కడ ఆయా వార్డుల అభ్యర్థులు బొడ్డు వినోద్, కొమిరెడ్డి శ్రీనివాస్, సుద్దాల హరిక-రాజేశ్వర్ గౌడ్, బోలుమల్ల వినయ్, తోట సుమలత-ప్రసాద్, ఆకుల ప్రవీణ్, బీమనాతి భవాని-సత్యానారాయణ, ఒజ్జెల బుచ్చిరెడ్డి, పూదరి జ్యోతి-సుధాకర్ గౌడ్, జావీద్, జోగ జగదీశ్వర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తన యాభై ఏళ్ల జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశానని, తనకు నాలుగు సార్లు, తన కొడుక్కి ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి సేవ చేస్తామని జగిత్యాల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఆంధ్రులతో పోరాడి కేసీఆర్ సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని దివాలా తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇంకా కేసీఆర్ ను తిట్టడమే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పెద్దలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.