రాజన్న సిరిసిల్ల, మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనమడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్ష్‌రావు సోమవారం సిరిసిల్ల జిల్లాకు వచ్చారు. మొదట వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌కు వచ్చిన హిమాన్ష్‌కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్థానిక నేతలను పరిచయం చేశారు.
తర్వాత సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ నివాసానికి వెళ్లి, ఆయన కార్ఖానాలో చేనేత మగ్గంపై నేస్తున్న చీరలు, వస్ర్తాలను పరిశీలించారు. పవర్‌లూం మగ్గంపై నేస్తున్న వస్ర్తాలను సైతం పరిశీలించి, సిరిసిల్ల నేతన్న నైప్యుణ్యాన్ని తన స్నేహితులకు వివరించారు.
మూడు చీరెలను కొనుగోలు చేశారు. అనంతరం సిరిసిల్ల గాంధీ చౌరస్తాలోని కేటీఆర్ టీ స్టాల్‌ను సందర్శించి, టీ తాగి హోటల్ బాగా నడుస్తుందా..? అంటూ నిర్వాహకుడు శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. తరువాత గంభీరావుపేటకు వెళ్లి కేజీ టూ పీజీ క్యాంపస్‌ను సందర్శించారు. గంభీరావుపేట మైదానంలో చిన్నారులు, పెద్దలు హిమాన్షుతో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు.