కరీంనగర్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజాయితీకి నిలువుటద్దం ఆయన.. పేదల పక్షాన అలుపెరగని పోరాటం చేసిన యోధుడు.. సిరిసిల్ల మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కలలు గన్న గొప్ప నాయకుడు.. పదవులు కాదు, మానవత్వం వెల్లివిరిసే సమాజ నిర్మాణమే తన ధ్యేయమని చెప్పిన మహానేత.. ఏడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన అజాత శత్రువు, అపర జ్ఞానశీలి, పోరాట యోధుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు. చిన్ననాటి నుంచే అభ్యుదయ భావాలను పుణికి పుచ్చుకున్న ఆయన, తుది శ్వాస వరకూ ప్రజల కోసమే పోరాడి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. డబ్బు ఏండ్లపాటు రాజకీయ ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించి, ఎందరికో మార్గనిర్దేశకుడయ్యారు. నేడు ఆయన శత జయంతి సందర్భంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తొమ్మిదో ప్యాకేజీకి రాజేశ్వర్రావుగా నామకరణం చేసి అరుదైన గౌరవం ఇచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామానికి చెందిన చంద్రమ్మ- శ్రీనివాస్‌రావు దంపతుల మొదటి సంతానం చెన్నమనేని రాజేశ్వర్‌రావు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములతోపాటు ఆరుగురు అక్కాచెల్లెలు. 1923 ఆగస్టు 31న జన్మించిన రాజేశ్వర్‌రావు ఉన్నత చదువులు చదివారు. విద్యార్థి దశలోనే ప్రజాఉద్యమాలు, విప్లవ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ కారణంగా ఎల్ఎల్బీ మధ్యలోనే ఆపివేశారు. చెన్నమనేని రాజేశ్వర్‌రావు సతీమణీ లలితాదేవి ఆయనతోపాటు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. రాజేశ్వర్‌రావు 2016మే 9న తుదిశ్వాస విడిచారు. రాజేశ్వర్‌రావుకు ముగ్గురు కుమార్తెలు అరుణ, కల్పన, డాక్టర్ ప్రభావతితోపాటు కొడుకు రమేశ్‌బాబు ఉన్నారు. ప్రస్తుతం రమేశ్‌బాబు వేములవాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
రాజేశ్వరరావు కలను నేరవేర్చిన కేసీఆర్
సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చెన్నమనేని రాజేశ్వర్‌రావు మెట్టప్రాంతమైన సిరిసిల్ల డివిజన్‌ను ఎత్తిపోతల పథకంతో సస్యశామలం చేయాలని మొదటి నుంచి ఆకాంక్షించారు. వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో సిరులు పండించే భూములు ఉన్నప్పటికీ నీటి వసతి లేదని, ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో తన వాణి వినిపించేవారు. అయినా అప్పటి సమైక్య పాలకులు వేదనను వినిపించుకోలేదు. మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏనాడూ పట్టించుకోలేదు. కానీ, కాళేశ్వరం జలాలతో ఇప్పుడు ఆ మెట్ట ప్రాంతమే ఇప్పుడు సిరుల గడ్డగా మారింది. సీఎం కేసీఆర్ తరలిస్తున్న కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతంలో ఇప్పటికే మూడింతలకు పైగా సాగు విస్తీర్ణం పెరిగింది. అంతేకాదు, నాడు ఏడారిని తలపిస్తూ పాతాళానికి పడిపోయిన భూగర్భజలాలు, నేడు అనుహ్యంగా ఉబికివచ్చి ఏకంగా ఐఏఎస్‌లకే పాఠ్యాంశంగా మారింది. తొందరలోనే మల్కపూర్ రిజర్వాయర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్లలోని ప్రతి ఎకరాకూ సాగునీరంది సస్యశ్యామలమవుతుంది. రాజేశ్వరరావు ఏ ఆశయం కోసమైతే తపించారో.. వాటిని సీం కేసీఆర్ ఆచరణలో చేసి చూపించారు. గోదావరి, కృష్ణజలాలు తరలించాల్సిందే అంటూ.. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను రాజేశ్వర్‌రావు సమర్థించారు. ఈ ప్రక్రియకు పూనుకోవాల్సిందే అంటూ సూచించారు.
నేడు శత జయంత్యుత్సవాలు
మహానేత చెన్నమనేని రాజేశ్వరావు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఆలాంటి మహానేత సేవలను స్మరించుకునేందుకు గానూ గురువారం చెన్నమనేని రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను వేములవాడలోని సంగీత నిలయంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే రమేశ్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రజా జీవితంపైన సాధించి విజయాలు-పోరాటాలపైన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. సహపంక్తి భోజనాలు పెట్టనున్నారు. ఈ వేడుకలకు మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు హాజరుకానున్నారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా..
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొన్న రాజేశ్వర్‌రావు అప్రహతిహతంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన రాజకీయ జీవితంలో పలుసార్లు ఓటమి పాలైనా.. ప్రజల పక్షాన పోరాడారే తప్ప కుంగిపోలేదు. తన రాజకీయ ప్రస్థానం చూస్తే.. 1952లో జైలులో ఉన్న సమయంలో మెట్పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పేరోల్‌పై వచ్చారు. రెండు నిముషాల సమయం మించి పోవడంతో నామినేషన్‌ను తిరస్కరించారు. తిరిగి 1957లో చొప్పదండి నియోజకవర్గం నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. ఆక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 1967, 1978, 1985, 1994 నాలుగుసార్లు సీపీఐ పార్టీ గుర్తుపై గెలిచిన ఆయన 2004లో మాత్రం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు పర్యాయాలు అంటే 67, 78, 85లో సీపీఐ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన రాజేశ్వర్‌రావు 1994లో సీపీఐ లెజిస్లేచర్ పార్టీ చైర్మన్‌గా వ్యవహరించారు.
ఇక 1962, 1977లో కరీంనగర్ లోక్‌సభకు, 1972, 1983, 1989, 1999లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి, 1984లో పెద్దపల్లి నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. మొత్తం ఆయన 13సార్లు చట్టసభలకు పోటీచేసిన అనుభవం ఉన్నది. ఆయన తనయుడు రమేశ్‌బాబు రాజకీయ ఆరంగేట్రం చేయడంతో 2009 నుంచి క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న రాజేశ్వర్‌రావు.. 2016 మే 9న శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని తన ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో చేపట్టిన ప్రతి పదవికి వన్నెతెచ్చారు. నాయకుడిగా నిస్వార్థ సేవలందించి ఆదర్శంగా నిలిచారు. సభలు, సమావేశాల్లో ఆయన అనుభవాన్ని, ప్రజా సమస్యలను, గతంలో చేసిన పోరాటాలను, భవిష్యత్ కోసం ప్రభుత్వాలుచేయాల్సిన పనులపై రంగరిస్తూ.. ఆయన ప్రసంగాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. అలోచింపజేశారు. గొప్ప కమ్యూనిస్టు నాయకుడిగా పేరు గాంచిన ఆయన, 1999లో తెలుగుదేశంలో చేరారు. టీడీపీ నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ లేజిస్లేచర్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ‘పదవి అనేది యుద్ధవీరుడి చేతులో కరవాలం. మానవత్వమే గమ్యం. మానవత్వం వెల్లివిరిసే సమాజమే నాధ్యేయం’ అంటూ ఆయన చెప్పిన మాటలు నేటితరాలకు స్ఫూర్తిదాయకం. ఒక్క మాటలో చెప్పాలంటే సుదీర్ఘ రాజకీయ అనుభవమున్నా.. ఏనాడు హంగు ఆర్భాటలకు పోకపోగా.. నమ్మి గెలిపించిన ప్రజల పక్షనా నిలిచి.. స్వపక్షం, విపక్షం అనే తేడాలేకుండా పోరాడి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
విద్యార్థి దశ నుంచే పోరు బాట
రాజేశ్వర్‌రావు విద్యార్థి దశలోనే పోరుబాట పట్టారు. 13 ఏండ్ల పసి ప్రాయంలో సిరిసిల్లలో జరిగిన 4వ ఆంధ్రమహాసభలకు స్వచ్ఛంద సేవకుడిగా హాజరయ్యారు. 1942లో 9వ తరగతి చదువుతున్నప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా విద్యార్థులను సమీకరించారు. పదోతరగతిలో విద్యార్థి సంఘం నాయకుడిగా ప్రారంభమైన రాజకీయ జీవితం అవిశ్రాంతంగా స్ఫూర్తిదాయకంగా సాగింది. క్విట్ఇండియా ఉద్యమ సమయంలో ఆప్పటికే ఆర్య సమాజ్‌లో స్వచ్ఛంద సేవకుడిగా కొనసాగుతూనే.. స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నారు. క్విట్ ఇండియా పోరాటంలో పాల్గొన్న నాయకులను అరెస్ట్ చేసిన తీరు రాజేశ్వరరావును కలిచివేసింది. స్వాతంత్య్ర సాధనకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న కాంక్షను రగిలించింది. పోరాట సహచరులను సమావేశపరిచి కరీంనగర్‌లోని పెరుమాండ్ల ఆలయంలో సాముహిక నిరహార దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి స్వయంగా వచ్చి ప్రశంసించారు. ఇదే సమయంలో బ్రిటిష్ వారిని పారదోలేందుకు విద్యార్థులు, యువకులు విప్లవో ద్యమంలో ముందునడువాలని బహిరంగ లేఖను విడుదల చేసి దేశంపై తనకున్న ప్రేమనుచాటుకున్నారు. చెన్నమేని పోరాటాలు అనేకం. అంచెలంచెలుగా 1947 నాటికి అఖిల హైదారాబాద్ విద్యార్థి సంఘం నాయకుడుయ్యారు. అదే యేడాది సెప్టెంబర్ 2న హైదరాబాద్ నడిబొడ్డున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఉద్యమ స్ఫూర్తిని చాటారు.
అరుదైన గౌరవం
చెన్నమనేని రాజేశ్వర్‌రావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అరుదైన గౌరవం ఇచ్చారు. శత జయంత్యుత్సవాల వేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 9కు రాజేశ్వర్రావుగా నామకరణం చేశారు. తెలంగాణ రైతాంగం కోసం ఆనాడే వరద కాలువల ద్వారా ఎత్తిపోతల పథకం కోసం రాజేశ్వర్‌రావు పోరాడిన తీరును కొనియాడారు. సిరిసిల్ల, వేములవాడ ప్రజలకు సాగు, తాగునీరు కష్టాలను తీర్చేందుకు ఎత్తిపోతల పథకం కోసం ఆనాడే ఎన్నో పోరాటాలు చేశారని కూడా గుర్తు చేశారు. వారి ఆకాంక్షలు సాగునీరు ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకాల నిర్మించుకున్నామని సీఎం పేరొన్నారు. ఆయన ప్రజాప్రతినిధిగా పనిచేసిన ప్రాంత ప్రజలకు కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన ప్యాకేజీ 9 ద్వారా సాగునీరు కూడా అందుతుందని గుర్తు చేశారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా..
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్‌లో మాత్రం నిజాం పాలనే కొనసాగింది. ఈ సమయంలో మేధావులు, ఉద్యమకారులను కలుపుకొని హైదరాబాద్ సంస్థాన విమోచన ఉద్యమంలో పాల్గొన్నారు. రహస్యంగా మారువేషాల్లో తిరిగారు. కాళేశ్వరం గోదావరి ఒడ్డున సిరొంచాలో క్యాంపు నిర్వహించిన సమయంలోనే.. పీవీ నరసింహరావుతో పరిచయం ఏర్పడింది. 1951లో కమ్యూనిస్టు ఉద్యమం సాగుతున్న సమయంలో రావినారాయణరెడ్డితోపాటు రాజేశ్వర్‌రావును అరెస్టు చేశారు. చెంచల్‌గూడ, ఔరంగబాద్, గుల్భార్గా జైళ్లకు తిప్పారు. అప్పుడే మార్కిజం, లెనిజంపై ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లుగా రాజేశ్వర్‌రావు ఒక ఇంటర్వూలో వెల్లడించారు. 1952లో జైలు నుంచి విడుదలయ్యాక కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా రైతు ఉద్యమాల్లో నిమగ్నమయ్యారు. అంచలంచెలుగా ఎదిగిన ఆయన, సీపీఐ జాతీయ కౌన్సిల్సభ్యుడిగా పనిచేశారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 77 ఏండ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, టీడీపీలో చేరడానికి ఎటువంటి కారణాలు చెబుతారో అన్న ఉత్కంఠ ఆనాడు అందరిలోనూ కనిపించింది. కానీ, టీడీపీలో తన చేరిక కేవలం వైయుక్తకమైనవే తప్ప రాజకీయమైనవి కాదని ప్రకటించి తన నిజాయితీని చాటుకున్నారు.
సెస్‌కు పునాది
1970లో అమెరికా ఫోర్టు ఫౌండేషన్ సహకారంతో కేంద్ర ప్రభుత్వ గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ అనుమతులతో అప్పటి సీఎంను ఒప్పించి దేశంలోని పలు రాష్ర్టాల్లో అమలవుతున్న గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంఘానికి (సెస్)కు పునాదులు వేశారు. ఈ సెస్ ద్వారా సిరిసిల్ల జిల్లాలో నూరు శాతం విద్యుదీకరణతోపాటు వ్యవసాయం, పవర్లూమ్ మగ్గాలకు మెరుగైన కరెంట్ సరఫరాచేసేందుకు ఆయన ప్రయత్నించారు. తన హయాంలో ఆనాటి ప్రభుత్వాన్ని ఒప్పించి సిరిసిల్ల రాయిని చెరువులో ఉన్న 600 ఎకరాల భూమిని వేలాది మంది నేత కార్మికులకు ఇండ్ల స్థలాలుగా పట్టాలు ఇప్పించారు. రాజేశ్వర్‌రావు అమితంగా ఇష్టపడే తన రాజకీయ గురువు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డి పేరును ఈ కాలనీకి పెట్టించారు.