కలెక్టరేట్, మార్చి 26 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని, కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం, తదితర అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో కేసు పూర్వపరాలు పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల్లో భాగంగా అవసరమైన కుల ధ్రువీకరణ పత్రం వీలైనంత త్వరగా జారీ చేయాలని సూచించారు.
మానిటరింగ్ కమిటీ సభ్యులు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. చింతకుంటలోని అంబేద్కర్ భవనాన్ని వినియోగంలోకి తేవాలని, భగత్‌నగర్‌లో కేటాయించిన స్థలానికి ప్రహరీ నిర్మించాలని సభ్యులు కోరారు. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహ కూడలి శుభ్రంగా ఉంచాలన్నారు. వీటిని వెంటనే పరిశీలించాలని సంబంధితాధికారులను ఆమె ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, అట్రాసిటీ కేసుల విషయంలో శరవేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీటీడీవో జనార్ధన్, బీఎండబ్ల్యూ పవన్‌కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాశ్, ఏసీపీ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.