కొత్తపల్లి, మే 19 : ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ఆగంరావు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ఆరు క్రికెట్ జట్లను ఎంపిక చేశామని, అండర్-25 విభాగంలో మొదట లీగ్ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తామన్నారు. ఎకువ పాయింట్లు సాధించిన నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు ప్రవేశిస్తాయని తెలిపారు. ఫైనల్‌కు చేరిన ఇరు జట్లకు మ్యాచ్ నిర్వహించి విజేతను ఎంపిక చేస్తామన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటే క్రీడాకారులను జూన్‌లో హైదరాబాద్‌లో జరిగే హెచ్‌సీఏ క్రికెట్ పోటీలకు ఎంపిక చేస్తామని, ఆ జట్టు ఉమ్మడి జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు. ఈ పోటీల్లో కరీంనగర్ నుంచి రెండు జట్లు, వేములవాడ నుంచి ఒకటి, జగిత్యాల నుంచి ఒకటి, గోదావరిఖని నుంచి ఒకటి పాల్గొంటాయన్నారు.
అలాగే, అండర్-19, అండర్-16, అండర్-14 విభాగాల్లోనూ ఆరు జట్ల చొప్పున ఎంపిక చేశామని, వీటికి విడుతల వారీగా పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. హెచ్‌సీఏ సౌజన్యంతో నిర్వహిస్తున్న అండర్-25 క్రికెట్ లీగ్ పోటీలను మొదట కరీంనగర్‌లోని సెయింట్ ఆల్ఫోన్స్ మైదానంలో ప్రారంభిస్తామని, శాతవాహన యూనివర్సిటీ మైదానం, వేములవాడలో పోటీలు జరుగుతాయని, ఈ నెల 21 నుంచి జూన్ 6వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు. మొత్తం 15 లీగ్ మ్యాచ్‌లు, ఒక ఫైనల్ మ్యాచ్ ఉంటాయన్నారు. ఇరు జట్లు మొదటి రోజు 50 ఓవర్ల చొప్పున ఒక ఇన్నింగ్స్‌ను, రెండో రోజు 40 ఓవర్ల చొప్పున ఒక ఇన్నింగ్స్ ఆడతాయన్నారు. ఈ పోటీలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించేందుకు హెచ్‌సీఏ అవకాశం కల్పించిందన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా క్రికెటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్ మురళీధర్‌రావు, ఉపాధ్యక్షుడు కే మహేందర్‌గౌడ్, సంఘ సభ్యులు అజిత్ కుమార్, హరికృష్ణ గౌడ్ పాల్గొన్నారు.