వేములవాడ, ఆగస్టు 18 : రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీల్లో అయినవారికి అందలం.. కానివారికి శఠగోపం అన్నట్లుగా తయారైంది. దేవాదాయ శాఖ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులను బదిలీ చేసింది. ఆరోపణలు ఎదురొంటూ ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్నారని కసరత్తు చేసి, కమిటీలు వేసి, ప్రత్యేక జీవోలు తీసి మరీ బదిలీ చేసింది. అయితే, వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన ఉన్నా అన్నీ మనకు చేరుతాయన్న సామెతను అక్షరాల నిజం చేశారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. జూలై 30 నాటికి బదిలీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక జీవోలను తీసి మరీ ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, యాదగిరిగుట్ట నుంచి వేములవాడ రాజ న్న ఆలయానికి బదిలీ అయిన పర్యవేక్షకుడు రాజన్‌బాబును మళ్లీ యాదగిరిగుట్టకే బదిలీ చేయగా, అకడికి బదిలీ అయిన పర్యవేక్షకుడు గోలి శ్రీనివాస్‌ను వేములవాడ ఎ మ్మెల్యే, ప్రభుత్వ విప్‌కు పీఏగా విధులు నిర్వహించేందుకు మార్పు ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది.
దేవాదాయ శాఖలో ఉద్యోగులు తిష్ట వేసి ఆలయాలను అప్రతిష్టపాలు చేస్తున్నారని, రాష్ట్ర దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ బదిలీ చేస్తామని సమావేశాలు నిర్వహించి మరీ నిర్ణయాలు తీసుకున్న ఉన్నతాధికారులు పది రోజులకే మార్పు ఉత్తర్వులు ఇచ్చారు. బదిలీల్లో పైరవీలకు తావులేదు.. నిక్కచ్చిగా ఉంటాయని సాక్షాత్తూ ఉద్యోగులను కార్యాలయానికి పిలిపించి మరీ చెప్పిన అధికారులే బదిలీ మార్పుల ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఉద్యోగులు తీవ్రంగా నిరసిస్తున్నారు. కమిటీలు వేసిన అధికారులు, బదిలీకి కసరత్తు చేసి ఇప్పుడెలా ఉత్తర్వులు మారుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి తర్వాత బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయశాఖ కమిషనర్ 7వ తేదీన రాష్ట్రంలోని అన్ని దేవాలయాల కార్య నిర్వహణాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే ప్రతి ఉద్యోగిని రిలీవ్ చేయాలని, ఉద్యోగులను రిలీవ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఈవోలను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు రిలీవ్ తీసుకోకపోయినా.. బదిలీ అయిన స్థానంలో రిపోర్టింగ్ చేయకపోయినా ఈవోలు వారిపై చర్యలు తీసుకోవాలని నికచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగులు విధుల్లో చేరారు. ఇంతవరకు బాగానే ఉన్నా రాష్ట్రంలోని భద్రాచలంలో పనిచేస్తున్న ఏఈఓ భవానీ రామకృష్ణను యాదగిరిగుట్టకు బదిలీ చేశారు. వేములవాడలో పనిచేస్తున్న ఏఈవో సంకెపల్లి హరికిషన్‌ను భద్రాచలం బదిలీ చేశారు. అయితే, భద్రాచలం ఏఈవో రిలీవ్ కాకపోవడంతో వేములవాడ ఏఈవో హరికిషన్‌ను యాదగిరిగుట్టకు బదిలీ చేశారు. భద్రాచలం కార్య నిర్వహణాధికారి అభ్యర్థన మేరకే ఏఈవోను రిలీవ్ చేయలేదన్న విషయం దేవాలయ ఉద్యోగులు చెప్పారు. ఇక ఇదిలా ఉంటే యాదగిరిగుట్టలో పనిచేసిన పర్యవేక్షకుడు రాజన్‌బాబు ఇకడే పని చేయాలని.. అతని సేవలు తమకు ఎంతో అవసరం ఉన్నాయని దేవాదాయ శాఖ కమిషనర్‌కు సాక్షాత్తూ అకడి ఈవో కోరినట్లు తెలిసింది. ఆయన కోరికను కూడా మన్నించిన కమిషనర్ కేవలం పది రోజులు కాకముందే మార్పు ఉత్తర్వులను జారీ చేస్తూ రాజన్‌బాబు యాదగిరిగుట్టకు పని చేయాలని ఆదేశించారు. మరి సదరు ఉద్యోగులపై ఈవోలకు ఉన్న ప్రేమ ఏంటి?. ఉద్యోగంలో చేరిన ఉద్యోగులతో పని చేయించుకోవాలని ఆదేశించాల్సిన కమిషనర్.. ఈవోలకు సదరు ఉద్యోగులపై ఉన్న ప్రేమను ఎందుకు కనికరించారో అర్థం కావడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పని చేయించుకోవాల్సిన సంబంధిత అధికారులు ప్రత్యేకంగా ఫలానా ఉద్యోగి కావాలని అడిగి తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటో ఇంకా లక్ష్మీనరసింహస్వామికో.. రాజరాజేశ్వరస్వామికో తెలియాలి. బదిలీల్లో పక్షపాతం చూపిస్తూ పారదర్శకత లేని వ్యవహారాన్ని ఆలయ ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి.