Putta Madhukar | మంథని, జూన్ 21: ఈ సందర్భంగా మంథనిలోని జయశంకర్ సార్ విగ్రహానికిప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస వరకు పోరాడిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్థంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి పుట్ట మధూకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తుదిశ్వాస వరకు పోరాటం చేసిన ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు.
నాడు ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు కోసం జయశంకర్ సార్ సారథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. పోరాటయోధుడే నాయకుడైతే పరిపాలన ఎలా ఉంటుందో 10ఏళ్లలో చూపించారన్నారు. తెలంగాణ రాష్ర్ట సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు, లక్ష్యాలతో పరిపాలన అందించారన్నారు. జయశంకర్ సార్ ఉద్యమాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ ఉద్యమకారుడిపై ఉందన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమ స్పూర్తితో ముందుకెళ్తామని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, కాయితీ సమ్మయ్య, ఎస్కే. యాకుబ్, ఆకుల రాజబాబు, వెల్పుల గట్టయ్యలతో పాటు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.