జగిత్యాల అర్బన్, అక్టోబర్ 3 : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకమని, మతి భ్రమించి మాట్లాడుతున్నారని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ మండిపడ్డారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజు మంత్రి సురేఖ ఎంగిలి మాటలు మాట్లాడారని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళా మంత్రులను అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్పై దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొండా వ్యాఖ్యలపై మాట్లాడాలంటేనే ఆసహ్యం వేస్తున్నదని, రాజకీయాల్లో ఇలాంటి మహిళలు ఉన్నారంటే బాధగా ఉందన్నారు. రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి కూడా సంస్కారహీనంగా బజారు భాష మాట్లాడారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి పేదల ఇండ్లను కూలుస్తున్నారని, దీంతో ప్రజలంతా బీఆర్ఎస్ వద్దకు వచ్చి తమ గోడును వెల్లబోసుకుంటున్నారని తెలిపారు.
బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను ఓర్వలేకనే కేటీఆర్‌పై సురేఖ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఒక కాంగ్రెస్ మహిళ కమిషన్‌గానే కాకుండా మహిళల పక్షాన ఉండి, మంత్రి సురేఖ మాటలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జగిత్యాల, రాయికల్ ఏఎంసీ మాజీ చైర్మన్లు శీలం ప్రియాంక ప్రవీణ్, ఉదయ్‌శ్రీ, రాయికల్ మండల మహిళా అధ్యక్షురాలు స్పందన పాల్గొన్నారు.