జగిత్యాల, మార్చి 25: కాంగ్రెస్‌ది అసమర్థ ప్రభుత్వమని, పాలన చేతకాక సబ్బండవర్గాలను ఇబ్బందులు పెడుతున్నదని ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కి పేదలను మోసం చేసిందని, పదహారు నెలల్లో చేసింది అప్పులు తప్ప సంక్షేమం శూన్యమని దుయ్యబట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పలువురికి సీఎంఆర్ఎఫ్ చెకులు పంపిణీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం పడిన అకాల వర్షాలు, వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే, మంత్రులకు తీరిక లేదా అని ప్రశ్నించారు. పాలనలో కాంగ్రెస్ విఫలమైందని, ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడితే దాటవేసే ధోరణిలో ఉన్నారే తప్ప, సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేరని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులు విపరీతంగా పెరిగాయని, పదహారు నెలల పాలనలో 1.58లక్షల కోట్ల అప్పు చేశారన్నారు.
దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇంత స్వల్పకాలంలో ఈ స్థాయిలో అప్పులు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేక రైతులు, చేనేత కార్మికులు ఆగమైతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రె స్ నాయకులు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని, కానీ రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామంలో సంపూర్ణంగా మాఫీ జరిగిన దాఖలాలు లేవన్నారు.
కానీ, ప్రభుత్వం అందరికీ చేశామని చెబుతున్నదని ఆగ్రహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థత వల్ల సాగునీరు సరిగ్గా అందడం లేదని, విదుత్ సరిగ్గా లేక ఎవుసం ఆగమైందని, లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన చెందా రు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. అనంతరం దావ వసంత మాట్లాడుతూ, కాంగ్రెస్ చేతగాని పాలనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సాగునీరందక ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతుంటే కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని మండిపడ్డారు.
ఇటీవల వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో అత్యాచార ఘటన చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అందాల పోటీలు కాదు మహిళలకు భద్రత కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు సతీశ్, ఆనంద్ రావు, వొల్లెం మల్లేశం, దయాల మాల్లారెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు.