కోరుట్ల రూరల్ : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు పొందింది. 2024–25 సంవత్సరానికి గాను నేషనల్ ఫెడరేషన్ కోపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో నేషనల్ బ్యాంకు ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబర్డ్) సిఫారసుతో నిర్వహించిన ఉత్తమ పనితీరు కనబరిచిన సహకార సంఘాల ఎంపికలో పైడిమడుగు సంఘం అఖిల భారత స్థాయిలో మూడో బహుమతిని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత, రైతులకు అందించిన రుణాలు మరియు ఇతర సేవలను సమగ్రంగా పరిశీలించి ఈ అవార్డును ప్రకటించారు.
అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 17న సిక్కిం రాష్ట్రంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొని అవార్డును స్వీకరించనున్నారు. సంఘం అభివృద్ధికి కృషి చేసిన పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతు సభ్యుల సమిష్టి శ్రమ ఫలితమే ఈ ఘనతగా సంఘం ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కూడా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.