కోరుట్ల : కోరుట్ల ప్రభుత్వ అగ్రికల్చరల్ మహిళా కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ కోరుట్ల(Korutla )ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ అలుగు వర్షిణిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్ లో గల బీఏస్సీ ప్రభుత్వ బాలికల వ్యవసాయ కళాశాలని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయానికి కళాశాలను అనుబంధం చేయాలని కోరారు. ఇటీవల కళాశాల విద్యార్థులు మౌలిక సదుపాయాలు కల్పించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన విషయాన్ని సెక్రటరీకి దృష్టికి తీసుకువెళ్లారు.
కళాశాలలో ప్రయోగశాల (ల్యాబ్) ఏర్పాటుతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని విన్నవించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ సంస్థల పరిధిలో ఉన్న కోరుట్ల మహిళ బీఎస్సీ వ్యవసాయ కళాశాలను ప్రతిష్టాత్మక రాజేంద్రనగర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంతో అనుసంధానం చేయాలని చేయాలని కోరారు. విశ్వవిద్యాలయ అనుసంధానంతో కళాశాలలో విద్యార్థినిలకు మెరుగైన వనరులు, అధ్యాపకుల కేటాయింపు, పరిశోధన అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. కళాశాల భవంతితో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయింపుకు సహకరించాలని కార్యదర్శికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.