కోరుట్ల, డిసెంబర్ 30 : ఆర్టీసీ ఉద్యోగులు బాధ్యతయుతంగా పని చేసి సమ్మక్క -సారక్క జాతరను విజయవంతం చేయాలని ఆర్టీసీ డిప్యూటీ రిజినల్ మేనేజర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్లపట్టణంలోని టీజీ ఆర్టీసీ డిపో గ్యారేజీలో ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మేడారం-సమ్మక్క సారలమ్మ జాతర కోసం విధులు నిర్వహించే ఉద్యోగులు బాధ్యతయుతంగా పని చేయాలని ఆయన సూచించారు.
తమకు కేటాయించిన విధుల్లో అలసత్వానికి తావు లేకుండా ఉద్యోగులు నిబద్ధతతో పూర్తి చేయాలని పేర్కొన్నారు. అధికారులు ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత వేళల ప్రకారం బస్సులు నడిపి ప్రయాణీకులను సురక్షితంగా జాతరకు తరలించాలని కోరారు. సమావేశంలో డిపో మేనేజర్ మనోహర్, ట్రాఫిక్ సూపరిండెంట్ లక్ష్మయ్య, అసిస్టెంట్ మెకానికల్ ఫోర్ మెన్ సాధిక్ అలీ, ఆఫీస్ సూపరిండెంట్ గంగారాం, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.