కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 7: కరీంనగర్లో గవర్నర్ పర్యటన నేపథ్యంలో బీసీ జేఏసీ నాయకులను నిర్బంధించారు. శుక్రవారం జిల్లాకేంద్రంతోపాటు పలు మండలాల్లో ముందస్తు అరెస్ట్టులు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లు ఆమోదించాలని డిమాండ్‌తో గవర్నర్ ఎదుట శాంతి యుత నిరసన తెలపాలని బీసీ నాయకులు నిర్ణయించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఉదయం నాలుగు గంటల నుంచే బీసీ నాయకుల ఇండ్లకు వెళ్లి అదుపులోకి తీసుకొని, పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉంచారు.
గవర్నర్ పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం వారిని వదిలిపెట్టారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఇదేం ప్రజా పాలన అని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కులేదా? అని ప్రశ్నించారు. తమను బలవంతంగా అరెస్టులు చేసి పోరాటాలను ఆపలేరని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా అక్కరకు రాని జీవోలు, ఆర్డినెన్స్‌లతో మభ్యపెట్టాలని కుటీల యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు విశ్రమించేది లేదన్నారు. ఇక్కడ బీసీ జేఏసీ నాయకులు ఎన్నం ప్రకాశ్, పెద్దిరాజ్ శ్రీధర్, ఆది మల్లేశం పటేల్, రాజమల్ల రాజు, దొగ్గలి శ్రీధర్, సంజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.