Aadi Srinivas | గల్ప్ దేశాలకు పంపిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ ట్రావెల్స్ గుట్టు బట్టబయలైంది. ఏకంగా ప్రభుత్వ విప్, వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఫోన్ చేసి గల్ఫ్‌కు పంపిస్తామని బేరసారాలు జరపడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దె ప్రాంతంలో నవీన్ అనే వ్యక్తి లక్ష్మీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ పేరుతో అక్రమ దందా నిర్వహిస్తున్నాడు. ఒక యువతి సాయంతో అమాయక ప్రజలకు ఫోన్లు చేసి గల్ఫ్ దేశాలకు పంపిస్తామని ఆశచూపి.. డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే నవీన్ నియమించుకున్న యువతి.. ఆది శ్రీనివాస్‌కు కాల్ చేసింది. గల్ఫ్‌లో మంచి జాబ్ ఆఫర్ ఉంది.. వెళ్తావా అని చెప్పింది. ఆమె చెప్పిన మాటలు వినగానే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీరియస్ అయ్యాడు. అసలు నువ్వు ఎవరికి ఫోన్ చేశావో తెలుసా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యాడు. నాకెందుకు ఫోన్ చేస్తున్నావని ప్రశ్నించాడు. ఎమ్మెల్యే సీరియస్‌గా మాట్లాడటంతో సదరు యువతి కూడా ఎదురుతిరిగింది. ఎమ్మెల్యేపైనే కోప్పడి కాల్ పెట్టేసింది.
ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆది శ్రీనివాస్. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆది శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన జగిత్యాల పోలీసులు.. లక్ష్మీ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండానే విదేశీ బ్రోకరేజి కన్సల్టెన్సీగా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. అలాగే సదరు మహిళ ఇలాగే అమాయకులకు కాల్ చేసి దుబాయి, మలేసియా, సింగపూర్, గల్ఫ్ దేశాల్లో మంచి జాబ్ ఆఫర్స్ ఉన్నాయంటూ ఫోన్లు చేసి మోసం చేసినట్లుగా తెలుసుకున్నారు. దీంతో వెంటనే ఆఫీస్‌ను సీజ్ చేసి, సదరు కన్సల్టెన్సీపై కేసు నమోదు చేశారు. అలాగే కన్సల్టెన్సీ నిర్వాహకుడు నవీన్‌ను అరెస్టు చేశారు.