అందుబాటులో ఉండి సేవ చేస్తా
ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీకి ఓటేయండి
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్
కందుగుల, వావిలాలలో ‘ధూంధాం’
హాజరైన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్
హుజూరాబాద్/ జమ్మికుంట, ఆగస్టు 23 : ‘నేను పేదింటి బిడ్డను.. ఉప ఎన్నికల్లో మీ చల్లని దీవెనలు అందించాలి’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి హుజూరాబాద్ మండలం కందుగుల, జమ్మికుంట మండలం వావిలాలలో ధూంధాం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఆడిపాడిగా, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో గ్రామాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా కందుగులలో గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ 2001 నుంచి రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించానని, 120కి పైగా కేసులు తనపై నమోదయ్యాయని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తానని, గతంలో ఉన్న నాయకుడి లెక్క ప్రవర్తించనని చెప్పారు. ప్రధాని మోదీ ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారని చెప్పారు. ఓట్లు అడగడానికి వచ్చే బీజేపీ నాయకులను దీనిపై నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం పని చేసే పార్టీకి ఓటు వేయాలని కోరారు.
దమ్ముంటే గెలువు
-ఈటలకు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్
ఉప ఎన్నికలో దమ్ముంటే ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌పై గెలుపొందాలని బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్ విసిరారు. సానుభూతి కోసం ఈటల నాటకాలు ఆడుతున్నాడని, ఇందులో భాగంగానే మోకాళ్ల నొప్పి నాటకం ఆడారన్నారు. దీనిని ప్రజలు ముందే పసిగట్టి ఆయన డ్రామాలకు తొందరలోనే ముగింపు పలికారన్నారు. ఓట్ల కోసం మరో కొత్త నాటకం ఆడేందుకు జమున సిద్ధమయ్యారని, వగల ఏడుపులు ఏడ్చేందుకు ముందుగానే తర్ఫీదు పొందుతున్నదని దుయ్యబట్టారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, ఎంపీపీ ఇరుమల్ల రాణి, సర్పంచ్ ప్రభావతిరెడ్డి, ఎంపీటీసీ కాసం పద్మరఘుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం ఐలయ్య పాల్గొన్నారు.
వావిలాలలో..
జమ్మికుంటలో నిర్వహించిన ధూంధాంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కళాకారులు పాటల రూపంలో ప్రజలకు వివరించారు. తర్వాత ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ప్రజల కోసమే పనిచేస్తున్న టీఆర్ఎస్కు మద్దతు పలుకాలని, కేసీఆర్ వెంటనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ రాష్ట్ర నాయకుడు శ్రీధర్‌రెడ్డి, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, నాయకులు సత్యనారాయణరావు, సమ్మిరెడ్డి, రఫీ, శ్రీలత, మహేందర్, రాజారాం, రాజేశ్వర్‌రావు, రామస్వామి, మల్లేశం, తిరుపతిరావు, వావిలాల, నగురం, నాగారం, పాపక్కపల్లి గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.