ఓసీపీ-2 గేట్‌మీటింగ్‌లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
రామగిరి, ఆగస్టు 11: సీఎం కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నాక సింగరేణిలో కనీవిని ఎరుగని విధంగా హక్కులను అమలు చేసి సంస్థకు పునరుజ్జీవం పోశారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ తెలిపారు. ఆర్జీ-3 పరిధి ఓసీపీ-2లో బుధవారం జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా కార్మికులు టీబీజీకేఎస్‌ను గెలిపించిన అనతి కాలంలోనే సుమారు 20కి పైగా డిమాండ్లను సాధించి పెట్టామన్నారు. తెలంగాణ ఇంక్రిమెంట్ నుంచి మొదలుకొని సకల జనుల సమ్మె వేతనాలు, మ్యాచింగ్ గ్రాంట్, 3500 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, 3800 పైచిలుకు నూత న ఉద్యోగాలు కల్పించిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. జాతీయ సంఘాలు పోగొట్టిన కారుణ్య నియామకాలను తిరిగి సీఎం కేసీఆర్ కృషితో సాధించుకున్నామని వెంకట్రావ్ వివరించారు. కార్మికుల క్వార్టర్లకు ఏసీ వసతి కల్పించామని పేర్కొన్నారు. దేశంలో ఏ బొగ్గు రంగ సంస్థలో లేని విధంగా కార్మిక, ఉద్యోగుల విరమణ వయసును 61 ఏండ్లకు పెంచారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 14వ తేదీన సర్క్యులర్ కూడా జారీ చేసేందుకు యాజమాన్యం సిద్ధం చేస్తుందన్నారు. ఆర్జీ-3 ఏరియా ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు దేవ వెంకటేశం, పర్స బక్కయ్య, దేవ శ్రీనివాస్, రమేశ్, రవిశంకర్, వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశ్, అల్లంకి రామారావు, పొన్నం సదయ్య రహీమొద్దీన్, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, శ్రీనివాస్, గణేశ్, తిరుపతి రెడ్డి, నరేశ్, లక్ష్మయ్య, పాముల శేషగిరి, కుమార్ తదితరులున్నారు.