ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణితో కలిసి పట్టణ ప్రగతి పనుల పరిశీలన
జగిత్యాల అర్బన్, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని 44వ వార్డులో ఆదివారం మొక్కలు నాటడంతోపాటు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. అలాగే 41, 35 వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, పాత భవన శిథిలాల తొలగింపు తదితర సమస్యలను వార్డు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శిథిలాల తొలగింపు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. వార్డులో పట్టణ ప్రగతి పనుల తీరుపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పట్టణంలోని 44వ వార్డులో హిందూ, ముస్లింలు కలిసి మెలిసి ఉంటారన్నారు.
ఇండ్ల ఎదుట మున్సిపల్ సిబ్బంది నాటిన మొక్కలను ఇంటి యజమానులే సంరక్షించాలన్నారు. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని అన్నారు. నూతన మున్సిపల్ కార్యవర్గం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రతినెలా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ద్వారా అభివృద్ధి పనులు శరవేగంతో జరుగుతున్నాయని వివరించారు. గత నాయకులే అవినీతి అధికారులను పెంచి పోషించారని, ఏసీబీ దాడులను స్వాగతిస్తున్నామని, అధికారులు సేవా భావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ, ప్రతివార్డు పచ్చదనంతో వెల్లివిరియాలని ప్రతి ఇంటికీ మొక్కలను అందజేస్తున్నామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పట్టణ ప్రగతిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్, అనుమల్ల జయశ్రీ, శివకేసరి బాబు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, బోలసాని పద్మావతి, నాయకులు సమాండ్ల శ్రీనివాస్, ఆనంద్ రావు, రంగు గోపాల్, తయ్యబ్ ఎత్తేమద్, అహ్మద్, కూతురు శేఖర్, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, డీఈ లచ్చిరెడ్డి, ఏఈ అయూబ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
జగిత్యాల రూరల్, జూలై 4: పట్టణంలోని టీఆర్‌నగర్‌కు చెందిన కే రాజుకు మంజూరైన రూ.60వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు ఆనంద్‌రావు, మ్యాకల పవన్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.