ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా స్వరాష్ట్రంలో తెలంగాణ అన్నం గిన్నెలా రూపుదిద్దుకున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, వరదకాలువ, రోళ్లవాగు ప్రాజెక్టుతో రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం పండించే జిల్లాగా అవతరించింది. వ్యవసాయ రంగానికి కేంద్రంగా మారిన జిల్లా ఇప్పుడు వరుసగా విద్యాసంస్థల ఏర్పాటుతో ఎడ్యుకేషన్ హబ్‌లా నిలుస్తున్నది. ఇప్పటికే డిగ్రీ, పీజీ కాలేజీలకు తోడు సాంకేతిక, వైద్య రంగంలో ఉన్నత విద్యను అందించే కాలేజీలతో జిల్లా కేంద్ర బిందువుగా మారింది. ఇటీవలే మెడికల్ కాలేజీ, అనుబంధంగా నర్సింగ్ కాలేజీని అందుబాటులోకి రాగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇప్పటికే పలు సాంకేతిక కోర్సుల కాలేజీలు సేవలందిస్తున్నాయి. 2008లో కోరుట్లలో పశువైద్య కళాశాల మంజూరైంది. తొలుత తాత్కాలిక భవనాల్లో కాలేజీ నిర్వహించినా.. అనంతరం పట్టణ సమీపంలోనే సకల హంగులతో పశు వైద్యకళాశాల ఏర్పాటైంది. కొన్నేళ్లుగా ఆ కళాశాల సేవలందిస్తున్నది. పశువుల్లో అద్దెగర్భంతోపాటు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నది. 1980 దశకంలో వ్యవసాయ శాఖ జగిత్యాల సమీపంలోని పొలాస శివారులో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పలు వ్యవసాయ విద్యా సంస్థలు సైతం ఉనికిలోకి వచ్చాయి. దాదాపు 20 ఏళ్ల కిందటే పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం అనుబంధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఇన్నేళ్లలో వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం వ్యవసాయ శాఖలో సేవలందిస్తున్నారు. 2008లో పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం ప్రాంగణంలోనే వ్యవసాయ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. దాదాపు పన్నెండేళ్లుగా వ్యవసాయ కళాశాలలో బోధన సాగుతున్నది. పాలిటెక్నిక్ కాలేజీ, అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజీ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న నేపథ్యంలో జగిత్యాల కాలేజీ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల కిందట అప్పటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల అగ్రికల్చర్ కాలేజీని, పరిశోధన స్థానాన్ని కలిపి విశ్వవిద్యాలయ స్థాయికి పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
గురుకులాలే.. గురుకులాలు…
సాంకేతిక, వైద్య విద్య సంస్థలతో పాటు జిల్లాలో పలు గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు, మైనార్టీ గురుకులాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. సంక్షేమ శాఖ జిల్లాలో ఐదు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయగా, అందులో దాదాపు 3వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. కోరుట్ల పట్టణంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా గురుకుల డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఐదు మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారు. ఈ ఐదు గురుకుల పాఠశాలల్లో 2,300 మంది విద్యార్థులు చదువుతున్నారు.
సాంకేతికకు కేరాఫ్‌గా జేఎన్టీయూ కాలేజీ
జగిత్యాల జిల్లాలో సాంకేతిక విద్యకు పర్యాయపదంగా నిలుస్తున్నది కొండగట్టు వద్ద ఏర్పాటైన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ. జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనుబంధంగా నిర్వహిస్తున్న ఈ కాలేజీ ముందు జిల్లా కేంద్రంలో తాత్కాలిక పద్ధతిలో నిర్వహించి, అనంతరం పూర్తిస్థాయి భవనంలోకి మార్చారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి సమీపంలో కొండగట్టు పుణ్యక్షేత్రానికి చేరువగా అత్యాధునిక పద్ధతిలో, సకల వసతులతో జేఎన్టీయూ కాలేజీ భవనం, వసతిగృహం నిర్మించారు. ఈ కాలేజీలో మూడు బ్రాంచుల్లో బీటెక్ కోర్సులను నిర్వహిస్తున్నారు. జేఎన్టీయూ కాలేజీలో చదివిన విద్యార్థులు ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా దేశ, విదేశాల్లో సేవలందిస్తున్నారు.
అందుబాటులోకి మెడికల్ కాలేజీ
గతేడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మెడికల్ కాలేజీని, దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. తర్వాత వారం వ్యవధిలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ జగిత్యాల మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా నిర్వహించే దవాఖానకు సంబంధించి 1001 బోధన, బోధనేతర పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్థల కేటాయింపుతోపాటు తాత్కాలిక భవన నిర్మాణాలు సైతం పూర్తి కావడంతో మెడికల్ కాలేజీ, వైద్యశాల ప్రారంభమయ్యాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు కాలేజీ తాత్కాలిక భవనాలను పరిశీలించి, బోధనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పింది. దాంతో ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీని ప్రారంభించేందుకు కేంద్రం అంగీకరించడంతోపాటు 150 సీట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలను స్వీకరించి విధులు నిర్వర్తిస్తున్నారు. నీట్ కౌన్సెలింగ్ ద్వారా కాలేజీకి విద్యార్థులను కేటాయించి బోధన ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, జిల్లాలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభం కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాలాంటి వారికి మేలు
నేను ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నా. నాకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌లో మంచి ర్యాంకు వచ్చింది. పొలాసలోనే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ ఉండడంతో, చేరితే బాగుంటుందని అనుకున్నా. కానీ, ఎంబీబీఎస్ చేయాలన్నదే నా లక్ష్యం. జగిత్యాలలో మెడికల్ కాలేజీ మంజూరు కావడం, ఈ సంవత్సరం నుంచి బోధన ప్రారంభం అవుతుండడం సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం ఇంటర్ పూర్తి చేసిన తర్వాత నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీటు సంపాదించాలన్నది నా ఆశయం. వచ్చే సంవత్సరం వరకు జగిత్యాల మెడికల్ కాలేజీ మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడే సీటు సంపాదిస్తే, ఇంటి వద్దే ఉంటూ, హాయిగా చదువుకోవచ్చు. మెడికల్ కాలేజీ లాంటి పెద్ద విద్యా వ్యవస్థను జగిత్యాల లాంటి మధ్యస్థ పట్టణంలో నెలకొల్పడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్‌కు విద్యార్థులు ఎప్పుడు రుణపడి ఉంటారు. అలాగే మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే హాస్పిటల్‌తో ఇక్కడి ప్రజలకు మేలు జరుగుతుంది.
– కే సాయి శ్రీజ, ఇంటర్ సెకండియర్ విద్యార్థి (జగిత్యాల)