Jagityal | జగిత్యాల టౌన్ : గత ఐదు రోజులుగా( ఈ నెల 19 నుంచి 23 వరకు) సంగారెడ్డి జిల్లాలోని గాడియం పాఠశాలలో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కుమ్మరి పల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ రూపొందించిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందుకున్నారు. దీంతో పాటుదక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన ఓవరాల్ ట్రోఫీ తెలంగాణ కు దక్కింది.
ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాశాఖాధికారి రాము, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, మండల విద్యాధికారి రాఘవులు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయుడు కాపు శ్రీనివాస్, సర్పంచ్ గుమ్మడి సంతోష్, ఉప సర్పంచ్ కొడిమ్యాల శేఖర్, ప్రధానోపాధ్యాయురాలు దేవలక్ష్మి తదితరులు అభినందించారు.