Rasamai Balakishan | తిమ్మాపూర్, సెప్టెంబర్ 1 : పీవీ గోష్ రిపోర్టు న్యాయబద్ధమైనది కాదని.. అది పీసీసీ రిపోర్ట్ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కండ్లకు కనిపిస్తలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల అమరవీరుల స్థూపాన్ని కాళేశ్వరం జలాలతో సోమవారం శుద్ధీకరణ చేశారు.
స్వయంగా ఎల్ఎండీ జలాశయంలోకి నాయకులతో కలిసి దిగి బిందెల్లో నీళ్లను తెచ్చి శుద్ది చేశారు. అనంతరం పీవీ ఘోష్ రిపోర్ట్ ను పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ ఇస్తే ఊరుకోబోమన్నారు. అది పక్కా ప్రణాళికతో పీసీసీ కార్యాలయంలో రాసుకున్న రిపోర్ట్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వరదలతో అతలాకుతలం అయి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతలు రావడంతో ఆగమేఘాల మీద రెండు రోజులు అసెంబ్లీ పెట్టీ బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకే, తెలంగాణ కళల ప్రాజెక్టు కాళేశ్వరం కీర్తిని త్యజించేందుకే అన్నట్లు వ్యవహరించారని విమర్శించారు. రైతులకు సరిపడా యూరియాను తేలేని దద్దమ్మ ప్రభుత్వం కాళేశ్వరం గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, సిద్ధం వేణు, శేఖర్ గౌడ్, పాశం అశోక్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.