మంథని, జూలై 15: మంథని నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మంథని పట్టణవాసులకు తాగునీరందించేందుకు 12.10 కోట్లతో అమృత్ 2.0 కింద స్థానిక పోచమ్మవాడలో వాటర్ ట్యాంక్, పైపులైన్ నిర్మాణ పనులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశృకృష్ణ, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం స్థానిక గురుకుల విద్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 4కోట్లతో పట్టణంలో అధునాతన వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ను నిర్మిస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధికి అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని చెప్పారు. ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలని సూచించారు.