Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 9: రాజకీయంగా అన్ని పదవులు ఆశించి, జన్మనిచ్చిన బీఆర్ఎస్ పార్టీని మాజీ జెడ్పీటీసీ రవీందర్ విమర్శించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస్ పథకంలో లబ్ధిదారులను గుర్తించడంలో ఎంపీడీవో, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎంపిక చేశారన్నారు. దానిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
అర్హులైన లబ్ధిదారుల పక్షాన బీఆర్ఎస్ ధర్నా చేపట్టే బీఆర్ఎస్ ను చిన్నాచితక పార్టీలు అంటూ విమర్శించడం సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్ నుండి మండల అధ్యక్షుడిగా, జెడ్పీటీసీగా అన్ని రకాల లబ్ధి పొందిన రవీందర్ పార్టీని అవహేళన చేయడం సరైనది కాదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి పబ్బం గడపడం, మంత్రి మెప్పు పొందడం వారికే సాటన్నారు. ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, హామీలు ఇవ్వడంలో విఫలమైందన్నారు.
ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస్ పథకం లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని కలెక్టర్ ను కోరారు. వివిధ కారణాలతో ఎంతోమంది రైతులు మృతి చెందారని వారికి రైతు బీమా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ప్రజా సంక్షేమ కోసం పాటుపడిన బిఆర్ఎస్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో బీసీ సెల్ మండల అధ్యక్షుడు అనుమాండ్ల సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు, మాజీ సర్పంచ్ సన్నీల్ల వెంకటేశం, గ్రామ శాఖ అధ్యక్షులు కత్తుల రమేష్, పిల్లి వేణు, నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.