Adluri Laxman Kumar | ధర్మారం, మే 31: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు లేకుండా తమపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో 108 మంది బాధితులకు రూ.33,88,500 సీఎంఆర్ చెక్కులు, 77 లబ్ధిదారులకు రూ.77,08,932 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ ప్రభుత్వం మీద చేసిన విమర్శలపై లక్ష్మణ్ కుమార్ స్పందించి మాట్లాడారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు అభివృద్ధి కోసం తీసుకువచ్చాడో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు తమ ప్రభుత్వం చేస్తుందని బండి సంజయ్ చేసిన విమర్శలను లక్ష్మణ్ కుమార్ ఖండించారు. బీఆర్ఎస్ తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో తమ పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదని అదంతా బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. కానీ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం సరైనది కాదని సంజయ్ కు ఆయన హితవు పలికారు. ఇకముందు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ పైన చౌకబారు విమర్శలు చేయడం మానుకొని హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అంతకుముందు సీఎంఆర్ ,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని అందుకే సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి వారికి తోడ్పాటును గా ఉంటున్నామని ఆయన అన్నారు.
వచ్చేనెల 3 నుంచి ధర్మారం మండలంలో నిర్వహించే భూభారతి గ్రామ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మణ్ కుమార్ కోరారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంగ మహేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయనను లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండి వకీల్, ఎంపీడీవో అయినాల ప్రవీణ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, ఆర్ఐ -2 వరలక్ష్మి, ఖిలా వనపర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ పోలు దాసరి సంతోష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగి రెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.