Teachers | హుజూరాబాద్ టౌన్, జూన్ 23 : ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన చర్య అని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లను పర్యవేక్షణ అధికారులుగా నియమించి, బాధ్యతలు అప్పగించడం సరికాదని అన్నారు.
విద్యారంగ సంక్షోభానికి దారితీస్తుందని వెంటనే ఈ ఉత్తర్వులను విరమించుకోవాలని అన్నారు. 629 మండలాలు, 1817 క్లస్టర్ల పరిధిలో ఉన్న 24,146 పాఠశాలలను తనిఖీ చేయడానికి పది సంవత్సరాల అనుభవం ఉన్న సుమారు రెండువేలకుపైగా ఉపాధ్యాయులకు తనిఖీ బాధ్యతలు అప్పగించి, విద్యా సంవత్సరం పొడవునా వారిని తనిఖీ బాధ్యతలలో ఉంచడంవల్ల, వారు సేవలందిస్తున్న ఆయా పాఠశాలలలో బోధన స్తంభించిపోతుందని అన్నారు. ఫలితంగా విద్యా ప్రమాణాలు కుంటు పడతాయని అన్నారు. ఒకవైపు ప్రభుత్వం రాష్ట్రమంతా అన్ని పాఠశాలలో విద్యా ప్రమాణాలకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఇలాంటి చర్యలకు పాల్పడడం అనాలోచితమైన చర్యగా పేర్కొన్నారు.
కామన్ సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి పూర్తిస్థాయి మండల విద్యాధికారులను, ఉప విద్యాశాఖ అధికారులను, జిల్లా విద్యాశాఖాధికారులను నియమించి పాఠశాలల పర్యవేక్షణ కొనసాగించాలని , తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తూ విద్యా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటికే పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ ఖాళీలు ఉండడంవల్ల బోధన స్తంభించిపోతున్నదని వెంటనే డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఎప్ నాయకులు చక్రధర్, వేల్పుల రత్నం, బీ శ్రీనివాస్, తిరుపతిరెడ్డి , మల్లేశం, శంకర్, శ్రీనివాస్, సదానందం, వెంకట్ స్వామి, ఆంజనేయులు, విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.