మూడు రోజులుగా వర్షం దంచికొడుతున్నది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏకధాటిగా పడ్డది. జడివానతో అంతటా వరద పోటెత్తింది. వాగులు, వంకలు పొంగిపొర్లి, లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచాయి. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 7.2 సెంటీమీటర్లు రికార్డయింది. శ్రీరాజరాజేశ్వర జలాశయం 12 గేట్లు, లోయర్ మానేరు జలాశయం 14 గేట్లు ఎత్తగా, దిగువకు వరద పరవళ్లు తొక్కుతున్నది. వేములవాడ మండలం ఫాజుల్‌నగర్ వద్ద ఒర్రె ప్రవాహంలో కారు కొట్టుకుపోయి, అందులో ప్రయాణిస్తున్న ఓ అమ్మమ్మ, రెండేండ్ల వయస్సుగల ఆమె మనుమడు మృతి చెందడం కలిచివేసింది.
కరీంనగర్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏకధాటిగా వర్షం పడింది. చిగురుమామిడి మండలంలో అత్యధికంగా 12.42 సెంటీ మీటర్లు, సైదాపూర్‌లో 11.56 సెం.మీ, గంగాధరలో 4.62, రామడుగులో 4.8, చొప్పదండిలో 5.1, కరీంనగర్లో 7.8, మానకొండూర్‌లో 6.26, తిమ్మాపూర్‌లో 8.14, శంకరపట్నంలో 8.44, వీణవంకలో 6.2, హుజూరాబాద్‌లో 8.12, జమ్మికుంటలో 7.34 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, చెక్‌డ్యాంలు కళకళలాడుతున్నాయి. మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి 32, 808 క్యూసెక్కులు, ఎగువ మానేరు నుంచి 46,608 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 96,539 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువన మానకొండూర్, వీణవంక, జమ్మికుంట మండలాల పరిధిలోని మానేరు వాగు పరవళ్లు తొక్కుతున్నది. కేశవపట్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అర్కండ్ల వాగులో వరద ప్రమాదకర స్థాయికి చేరడంతో ఇక్కడి లోలెవల్ వంతెన మీదుగా రాకపోకలు నిలిపి వేశారు. హుజూరాబాద్ శివారులోని చిలువ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇక్కడి రంగనాయకుల గుట్ట వద్ద గల కల్వర్టు మీదుగా భారీ వరదతో కనుకులగిద్దె, జూపాక, ధర్మరాజులపల్లి గ్రామాలు హుజూరాబాద్ మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. చిగురుమామిడి మండలం ఇందుర్తి, సిద్దిపేట జిల్లా కోహెడ మధ్యన ఉన్న ఎల్లమ్మ వాగు ఉధృతితో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు ఆటంకం కలిగింది.