POCSO case registered | గంగాధర,అక్టోబర్ 28: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల ప్రాంగణం కీచక అటెండర్ వేధింపులకు నిలవుగా మారింది. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో అటెండర్ ఆకృత్యాలకు అదుపు లేకుండా పోయింది. అటెండర్ వేధింపులకు ప్రధానోపాధ్యాయురాలికి తెలిసినా, ఆమె విద్యార్థులనే బెదిరించడంతో ఏడాదికాలంగా వేధింపులను భరిస్తున్నారు.
స్థానికుల కథనం మేరకు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో యాకుబ్ పాషా అనే వ్యక్తి అటెండర్ గా పనిచేస్తున్నాడు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఆపై ఆ ఫొటోలతో విద్యార్థులను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయాన్ని విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు కమల దృష్టికి తీసుకువెళ్లారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులనే బెదిరించింది. ఉపాధ్యాయులను విద్యార్థులను, బెదిరించి సంఘటనను దాచి పెట్టింది. దీంతో ఏడాదికాలంగా విద్యార్థులు యాకుబ్ పాషా ఆకృత్యాలను భరిస్తూ వస్తున్నారు.
గత శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన సభ కార్యక్రమంలో జరిగిన సంఘటనను విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కలెక్టర్ పమేళాసత్పత్తి ఆదేశాలతో అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు. అధికారుల విచారణలో పాఠశాలలో జరిగిన దారుణం తెలిసింది. అధికారుల విచారణలో విద్యార్థులపై లైంగిక దాడి జరిగినట్టు వెల్లడైంది. అధికారులు నివేదికను కలెక్టర్ ప్రమేలా సత్పతికి అందజేశారు. అలాగే విచారణ అనంతరం నిందితుడు యాకుబ్ పాషాపై ఐటీ, పోక్స్ క్రింద కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. సంఘటనను కప్పి పెట్టడానికి ప్రయత్నించిన ప్రధానోపాధ్యాయురాలు కమలను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అనుమతి లేకుండా జిల్లా హెడ్ క్వార్టర్ దాటి బయటికి వెళ్లవద్దని ఆదేశించారు.