కమాన్‌చౌరస్తా, జనవరి 30 : దావోస్‌లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలతో పాటు, పలు రకాల పరిశ్రమలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇటీవల దావోస్ పర్యటన పూర్తిచేసుకున్న ఆయన గురువారం కరీంనగర్ శ్రీనగర్ కాలనీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సంస్థలు తృతీయ శ్రేణి పట్టణాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటిస్తున్నదని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన నిరుపేదలకు, ఇండ్లు లేని వారిని గుర్తించి ఇస్తామన్నారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్ నాయకులు ఉన్నారు.
టెక్ జెనీ సాఫ్ట్వేర్ సంస్థ ప్రారంభం
జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్‌లో ఏర్పాటు చేయనున్న సాఫ్ట్వేర్ సంస్థ టెక్ జెనీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నగరంలోని ఒక ఫంక్షన్ హాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా కేంద్రానికి చెందిన కొండా శ్యాం ఆధ్వర్యంలో స్థానిక యువతకు ఉపయోగ పడేలా సంస్థను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, తదితరులు ఉన్నారు.