కోరుట్ల, అక్టోబర్ 1 : ‘కోరుట్ల బల్దియా 2 కోట్ల లోటు బడ్జెట్లో ఉంది. పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఇలాంటి సమయంలో పట్టణాభివృద్ధికి వినియోగించాల్సిన జనరల్ ఫండ్ నుంచి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు విగ్రహ నిర్మాణానికి 21 లక్షలు కేటాయించడం భావ్యమేనా?’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రశ్నించారు. మాజీ మంత్రిపై తనకు అభిమానం ఉందని, ఆయన విగ్రహ నిర్మాణ తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించామని గుర్తు చేశారు.
రాజకీయాలకు అతీతంగా విగ్రహ నిర్మాణానికి తన సొంత నిధులు అందిస్తానని ప్రకటించారు. కోరుట్ల నియోజవర్గాన్ని పార్టీలకతీతంగా సమష్టిగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికార పార్టీ నాయకులతో కలిసి పని చేసేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కోరుట్లలో మున్సిపల్ నిధుల కేటాయింపులో వివక్ష చూపారని, అధికార పార్టీ కౌన్సిలర్ల వార్డులకు మాత్రమే నిధులు కేటాయించి విపక్ష సభ్యుల వార్డులను విస్మరించడం దురదృష్టకరమన్నారు.
అధికార బలంతో తీర్మానం చేసిన నిధులు కేటాయింపు అంశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన మున్సిపల్ నిధులను మౌలిక అవసరాలు, పారిశుధ్య కార్మికుల జీతాలకు వెచ్చించాలని మున్సిపల్ చైర్మన్, అధికారులకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతోపాటు ఎమ్మెల్యేగా తాను మహనీయుల విగ్రహల నిర్మాణాలకు సొంత నిధులు సమకూర్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో యథా రాజా.. తథా పాలన అన్నట్టు పాలన కొనసాగుతున్నదని, హామీల అమలు లేదని, నిధులు రాక, పనులు సాగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పది నెలల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గానికి నయా పైసా నిధులు రాలేదని, రైతు బంధు, రైతు భరోసా, మహిళలకు 2500 ఫించన్ ఊసేలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో హైడ్రా పేరిట పేద ప్రజల ఇండ్లు కూల్చి వేస్తుంటే, కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అక్రమ నిర్మాణాలకు ఊతమిస్తున్నరని , ఇదేం పాలన అని ప్రశ్నించారు. పదిహేనేండ్లుగా ఎంతో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మెట్పల్లిలో ఇరుకుగా ఉన్న రహదారిని ఆనుకొని బస్‌షెల్టర్ నిర్మాణానికి ప్రయత్నించడం సరికాదన్నారు. రాజకీయ పరమైన అంశాల్లో విద్యార్థులను భాగస్వాముల్ని చేయడం ఆందోళన కలిగించిందన్నారు. అధికారులు తమ విధులను నిజాయితీతో సక్రమంగా నిర్వర్తించాలని, రాజకీయ నేతల ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగి వ్యవస్థను భ్రష్టుపట్టించవద్దని హితవు పలికారు.
నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మైనార్టీ పట్టణాధ్యక్షుడు ఫహీమ్, మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, కౌన్సిలర్లు ముజాఫర్ ఆహ్మద్, పోగుల ఉమారాణి, పేర్ల సత్యం, నాయకులు చీటి వెంకట్రావు, బట్టు సునీల్, మురళి, మోహన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అతిక్, సనావొద్దీన్, సురేందర్, అస్లాం పాల్గొన్నారు.