గంభీరావుపేట, ఫిబ్రవరి 15: రైతన్నను సమస్యలు వెంటాడుతున్నాయి. ఓవైపు సాగునీటి కొరత.. మరోవైపు కరెంట్ వ్యథలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇందుకు గంభీరావుపేట మండలం ముస్తఫానగరే నిదర్శంనగా నిలుస్తున్నది. ఇక్కడ వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించి ట్రాన్స్ఫార్మర్పై ఓవర్ లోడ్ పడుతుండడంతో తరచూ కాలిపోతున్నది. ఫలితంగా కరెంట్ లేక ఇక్కడి రైతులు పొలానికి నీరు పారించుకోలేని పరిస్థితి దాపురించింది.
మూడు రోజుల క్రితం సైతం కాలిపోగా, ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడం, పంటలకు నీరందక ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఓవర్ లోడ్ సమస్యను పరిష్కరించాలని, ట్రాన్స్ ఫార్మర్కు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు శింవది దేవయ్య, అక్బర్, దేవేందర్, దోమకొండ రాజయ్య, కృష్ణకాంత్, శ్రీనివాస్, భూమయ్య, రాములు, నర్సయ్య, కంటె దేవయ్య తదితరులు ఉన్నారు.