సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రైతన్నను గతంలో ఎన్నడూ లేనివిధంగా వెంటాడుతున్నాయి. ఒకప్పుడు పుష్కలమైన జలాలతో భూమికి బరువైన పంటలు పండించి పల్లెలు ఇప్పుడు పంటలను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నాయి. ధర్మారం మండలం కొత్తపల్లిలో సాగునీరందక పొలాలు బీటలు వారుతున్నాయి. ఇది చూసిన రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి.
పెద్దపల్లి, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ధర్మారం మండలం కొత్తపల్లి శివారులో గిరిజన రైతులు ఏటా దాదాపు 400 ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. భూగర్భజలాల ఆధారంగా పంటలు పండిస్తుంటారు. రెండేండ్ల కిందటి వరకు గ్రామంతోపాటు సమీపంలోని చెరువులు, కుంటల్లో పుష్కలంగా జలాలు ఉండడం వల్ల భూగర్భజలాలు సమృద్ధిగా ఊరి రెండు పంటలు తీశారు. అయితే గత రెండు సీజన్ల నుంచి అష్టకష్టాలు పడుతున్నారు.
భూగర్భజలాలు తగ్గిపోతుండడంతో పంటలను కాపాడుకోలేక తండ్లాడుతున్నారు. ఈ యేడాది 400 ఎకరాల్లో పంట వేయగా, అందులో 50 ఎకరాలు ఇప్పటికే ఎండిపోయింది. మరో 350 ఎకరాలు ఎండిపోయే దశకు చేరింది. కండ్లముందే పంటలు దెబ్బతింటుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటలు కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. 60వేల నుంచి 70వేల వరకు పెట్టుబడి పెట్టి పూడిక తీయిస్తున్నా ఫలితం లేక పంటలను పశువులకు మేతగా వదిలేస్తున్నారు.
లింక్ కెనాల్‌పై సర్కారు నిర్లక్ష్యం
కొత్తపల్లి శివారులోని భూములకు సాగునీరందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం బొమ్మారెడ్డి పల్లిలోని ఎస్సారెస్పీ ఉపకాలువకు అనుసంధానంగా కాలువ నిర్మాణానికి 19కోట్లు మంజూరు చేసి, పనులు ప్రారంభించింది. కానీ, ప్రభుత్వం మారిన తర్వాత పట్టించుకునేవారు లేక మధ్యలోనే ఆగిపోయింది. దీనిపై పాలకులు దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ కాలువ నిర్మాణం ఓ కొలిక్కి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
..పక్క చిత్రంలో కనిపిస్తున్నది గుగులోత్ కలమ్మ. ఆమె మూడెకరాల పొలం ఇప్పుడిప్పుడే ఎండిపోతున్నది. గతేడాది ఇదే బావి పూడిక తీయించేందుకు 70వేలు ఖర్చు చేసింది. మళ్లీ ఈ యేడాది బావి ఎండింది. వారం రోజులుగా క్రేన్‌తో పూడిక తీయిస్తున్నది. ఇప్పటికే 60వేల వరకు ఖర్చు చేసింది. అయినా నీళ్లు వస్తాయనే నమ్మకం లేక ఆందోళన చెందుతున్నది. ఇలా అయితే ఎలా సాగు చేస్తామని, తమ రెక్కల కష్టం అంతా ఈ నీళ్లకే పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
ఎక్కడా లేని కష్టం వచ్చింది
కాలువ నిర్మాణం కోసం పైసలు వచ్చినయి. పని మొదలైంది. ప్రభుత్వం మారినంక మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని పట్టించుకునేటోళ్లు లేరు. మాకు ఎక్కడా లేని కష్టం వచ్చింది. ఆ కాలువ నీళ్లస్తేనే మాకు కష్టాలు తీరుతయి. గతంల ఎప్పుడూ ఇట్ల ఇంత ఘోరంగా పంటలు ఎండిపోలే. పంటలు చూస్తుంటే దుఃఖమస్తంది.
– అజ్మీరా సురేందర్, రైతు
ఇరువై గుంటలు పోయేటట్టే ఉన్నది
నాకు ఇక్కడ ఉన్న భూమే 20 గుంటలు. తిండి మందం పెట్టుకుంట. కానీ, ఈ సారి ఘోరంగా కరువచ్చింది. బావుల్ల నీళ్లు లేవు. ఇప్పటికే నా పది గుంటల పొలం ఎండింది. ఇంకా పది గంటలు కూడా ఎండేటట్టు ఉన్నది. మమ్ముల ప్రభుత్వమే ఆదుకోవాలే.
– గుగులోతు రాజు నాయక్, రైతు