టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న బాగోతం బట్టబయలైంది. విచారణలో భాగంగా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని నిక్కచ్చిగా వ్యవహరించి, లెక్క తేల్చడంతో కలవరం మొదలైంది. ఈ వ్యవహారంలో అడుగడుగునా నిబంధనలు బేఖాతరు చేయడంతోపాటు నిధులు దుర్వినియోగం జరిగినట్టు గుర్తించి.. ఇద్దరు అధికారులను యుద్ధప్రాతిపదికన సస్పెన్షన్ చేయాలని సిఫారసు చేస్తూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అలాగే దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయడంతోపాటు అందుకు సంబంధించిన ఫైలు మాయంపై పోలీస్ కేసు నమోదు చేయాలని, సదరు అధికారి ఉన్న సమయంలో జరిగిన లావాదేవీలపై లోతైన విచారణ జరుపాలని సిఫారసు చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఈ వ్యవహరంలో నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకుంటారా..? లేదా అన్నది మున్ముందు తేలనున్నది.
కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ జిల్లా విద్యాశాఖలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఏసీజీఈ) విభాగంలో టెన్త్ ఆన్సర్స్ పేపర్స్ అమ్ముకున్న వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. విక్రయ సమయంలో నిబంధనల ఉల్లంఘన, ప్రభుత్వ ఖాతాకు చెల్లించని డబ్బులు, విషయాన్ని కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నాలు, ఒక దశలో కలెక్టర్‌నే పక్కదారి పట్టించేందుకు కదిపిన పావులు, అందుకు సంబంధించి ఫైలు మాయం.. వంటి ప్రతి అంశాన్నీ ఎత్తి చూపిన విషయం విదితమే. ముందుగా గతనెల 15న ‘టెన్త్ పేపర్స్ అమ్ముకున్నరు? శీర్షికన ఇచ్చిన కథనంతో అక్రమాలను బహిర్గతం చేసింది.
ఆ తర్వాత అదే నెల 20న ‘విద్యాశాఖలో కదులుతున్న అవినీతిడొంక?’, ఈ నెల 5న ‘విద్యాశాఖలో అవినీతి బట్టబయలు!’, 15న ‘విద్యాశాఖలో కదులుతున్న అవినీతి డొంక!’ కథనాలతో ప్రతి విషయాన్నీ బయటపెట్టింది. రాష్ట్ర డైరెక్టర్ సీరియస్ కావడం, ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ ఆదేశాలు ఇవ్వడం, అదే సమయంలో కలెక్టర్ పమేలా సత్పతి సీరియస్ కావడం, విచారణకు ఆదేశించడం వంటి పరిణామాలపై ఎప్పడికప్పుడు ‘నమస్తే’ ప్రచురించిన కథనాలు విద్యాశాఖలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు స్పందించడంతో చర్యలకు అడుగులు పడుతున్నాయి.
బహిర్గతమైన లెక్కలు
టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న వ్యవహారంపై కలెక్టర్ పమేలా సత్పతి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ అశ్విని తానాజీ వాకడేను విచారణ అధికారిగా నియమించారు. ఈ నెల 14న అదనపు కలెక్టర్ విచారణ నిర్వహించారు. విచారణకు హాజరు కావాలంటూ విద్యాశాఖలోని పలువురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. జిల్లా ఇన్చార్జి డీఈవో మొండయ్య సమక్షంలో ఒక్కో అధికారిని పిలిచి, పూర్తి స్థాయిలో విచారణ జరిపారు.
ఆ మేరకు అనేక అంశాలను నిశితంగా పరిశీలించి సిద్ధం చేసిన నివేదికను రెండు రోజుల క్రితమే కలెక్టర్‌కు పంపినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. నివేదికలో నిబంధనల బేఖాతరు, నిధుల దుర్వినియోగాన్ని ఎత్తిచూపుతూనే చర్యలకు సిఫారసు చేసినట్టు తెలుస్తున్నది. ‘నమస్తే’కు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే.. ప్రస్తుతం డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న నరసింహస్వామి గతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అధికారి (ఎఫ్ఏసీ)గా పనిచేశారని, ఆ సమయంలో జరిగిన సమాధాన పత్రాల అమ్మకాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు.
వచ్చిన డబ్బులను ప్రభుత్వ ఖాతాకు జమచేయకుండా దుర్వినియోగం చేశారని, ఆయన తన చట్టబద్ధమైన విధులు నిర్వహించడంలో విఫలమయ్యారని, అలాగే సూపరింటెండెంట్‌గా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ (ఏసీజీఈ)గా రిజిస్టర్ల నిర్వహణ, పర్యవేక్షణలోనూ విఫలమయ్యారని, ఫలితంగానే అందుకు సంబంధించి ఫైలు మాయమైందని పేర్కొన్నట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో విచారణ తర్వాత కూడా నరసింహస్వామి రికార్డులు సమర్పించలేదని, ఆయనకు గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆలస్యంగా వివరణ ఇచ్చారని, ఇది ఆయన నిర్లక్ష్యాన్ని చూపుతున్నదని, సమాధాన పత్రాల అమ్మకాలకు సంబంధించిన ఫైలు మాయమైన విషయాన్ని దాచిపెట్టి అధికారులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని, పైగా కలెక్టర్ సూచనల మేరకే నిధుల మళ్లింపు జరిగినట్టు తప్పుగా పేర్కొన్నారని, సంబంధిత ఆధికారుల అనుమతులు లేకుండా నిధుల మళ్లించారని గుర్తించినట్టు తన నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది.
చర్యలకు సిఫారసు?
లోపాలను గుర్తించిన అదనపు కలెక్టర్, చర్యలకు గట్టిగానే సిఫారసు చేసినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా ఏసీజీఈ నరసింహస్వామి పనిచేసిన కాలంలో జరిగిన అన్ని అధికారిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేందుకు నరసింహస్వామిని తక్షణమే సస్పెండ్ చేయాలని సిఫారసు చేసినట్టు తెలుస్తున్నది. ఆయనతోపాటు ఫైలు మాయంపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్న ఏ మధుసూదన్‌ను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని సిఫారసులో పేర్కొన్నట్టు సమాచారం. ఫైలు మిస్‌కావడం, నిధుల మళ్లించడం వంటి అంశాలపై పోలీసు కేసు నమోదు చేయవచ్చని, దుర్వినియోగం అయిన మొత్తాన్ని సంబంధిత బాధ్యుల నుంచి రివకరీ చేసి ప్రభుత్వ ఖాతాకు జమచేయాలని పేర్కొంటూ కలెక్టర్‌కు సిఫారసు చేసినట్టు తెలిసింది. తన విచారణలో భాగంగా తెలిసిన అంశాలు, నిబంధనలు బేఖాతరు, పక్కదారి పట్టిన నిధులు వంటి అంశాలకు సంబంధించిన పత్రాలను సైతం నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తున్నది.
నిజానికి అదనపు కలెక్టర్ విచారణ సమయంలోనూ సదరు అధికారి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తున్నది. కానీ, అదనపు కలెక్టర్ మాత్రం నిక్కచ్చిగా విచారణ చేయడంతో పాటు నివేదికను కూడా అతి తక్కువ సమయంలోనే కలెక్టర్‌కు సమర్పించిన తీరుపై విద్యాశాఖలోనే ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వ్యవహారమంతా కలెక్టర్ పమేలా సత్పతి కోర్టులో ఉన్నది. అదనపు కలెక్టర్ అందించిన నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకుంటారా..? లేక ఏమైనా ఒత్తిళ్లకు తలొగ్గుతారా..? అన్నది తేలాల్సి ఉన్నది. అయితే ఈ విషయంలో కలెక్టర్ కూడా చాలా సీరియస్‌గా ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. కాగా, కొంతమంది నాయకులు మాత్రం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో చర్యలుంటాయా..? లేదా అన్నది మున్ముందు తేలుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.