వేములవాడ, మే 28 : రాజన్న ఆలయంలో అంతర్గత బదిలీల ప్రక్రియ గందరగోళంగా తయారైంది. అధ్వానంగా మారుతున్నది. ఒక రికార్డ్ అసిస్టెంట్‌ను నాలుగు నెల ల్లో మూడు విభాగాలకు ట్రాన్స్ఫర్ చేయడం విమర్శలకు తావిస్తుండగా, చోటు మారేందుకు ఇష్టపడని వారి పైరవీల జోరు నడుస్తున్నట్లు తెలుస్తున్నది. వారం రోజుల కింద 12 మందికి స్థానచలనం కల్పించగా, మరో విభాగానికి వెళ్లేందుకు ఇష్టపడని పలువురి ఒత్తిళ్లతో మళ్లీ యథాస్థానంలో కొనసాగించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఓ వైపు ఆలయంలో పర్యవేక్షకుల కొరత వేధిస్తుండడం, ఉన్నవారిపై అదనపు భారం పడుతుండడంతో పాలన గాడి తప్పుతున్నదనే విమర్శ వస్తున్నది.
రాజన్న ఆలయంలో 12 మంది ఉద్యోగులను ఈ నెల 21న అంతర్గతంగా బదిలీ చేశారు. ఇందులో ఐదుగురు పర్యవేక్షకులు, ఒక సీనియర్ అసిస్టెంట్, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. అయితే, వీరిలో ఒక ఉద్యోగి తాను పనిచేస్తున్న ప్రధాన విభాగాన్ని వీడేది లేదని భారీగా పైరవీ చేసినట్లు సమాచారం. ఏకంగా దేవాలయ ఉన్నతాధికారిపై ఒత్తిడి తేవడంతో ప్రస్తుతానికి యథాస్థానంలో కొనసాగించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఒక రికార్డ్ అసిస్టెంట్‌ను నాలుగు నెలల్లో మూడు విభాగాలకు ట్రాన్స్ఫర్ చేయడం విమర్శలకు తావిస్తున్నది. తొలుత విచారణ విభాగానికి బదిలీ చేసి, నెలన్నర క్రితం కల్యాణకట్ట, ఆ వెంటనే గోశాలకు బదిలీ చేయడంతో సదరు ఉద్యోగి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సెలవుపై వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఆలయంలో పర్యవేక్షకుల కొరతతో పాలన గాడితప్పుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. 14 మంది పర్యవేక్షకులు ఉండాల్సి ఉండగా, సాధారణ బదిలీలతో వారి సంఖ్య తొమ్మిదికి పడిపోయింది. ఇందులో ఒకరు అనారోగ్యం తో సెలవులో ఉండగా, మరొకరు ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఏడుగు రు మాత్రమే విధుల్లో ఉండగా, ఒకొకరికి మూడు శాఖలతో అదనపు బాధ్యతలు అప్పగించడంతో పనిభారం పెరుగుతున్నది. ఫలితంగా ఏ ఒక్క బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా, పర్యవేక్షకుల విషయంలో ఆలయ ఈ వో వినోద్‌రెడ్డిని వివరణ కోరగా వచ్చే సమ్మ క, సారలమ్మ జాతర సందర్భంగా మరింత సిబ్బందిని కేటాయించాలని రాష్ట్రదేవాదాయ శాఖ కమిషనర్‌ను కోరుతామని తెలిపారు.
ఆలయంలో అంతర్గత బదిలీలు సర్వసాధారణమే అయినప్పటికీ పరిపాలన కార్యాలయంలోని ఓ అధికారి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వి మర్శలకు తావిస్తున్నది. ఇటీవల ఆరోపణలు ఎదురొన్న ఒక రికార్డు అసిస్టెంట్‌కు జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించి, తర్వాత అ తనిపై చార్జెస్ ఉన్నాయని ఇచ్చిన పదోన్నతిని వె నకి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెలలో రెండు సార్లు అంతర్గత బదిలీలు చేపట్టగా, 16న తొలి విడుతగా జరిగిన 8 మంది బదిలీల వ్యవహారంలో ఆయన మార్ చూపించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన శాఖల బదిలీల వ్యవహారంలో ఆరోపణలున్నాయి.