Self-help group | మల్యాల, జూన్ 23: స్వయం సహాయక సంఘ సభ్యురాలు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులకు శ్రీనిధి ద్వారా సభ్యురాలి ప్రమాద బీమా పరిహారం కింద మంజూరైన రూ.10 లక్షల చెక్కును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొంది కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడంతోపాటు అనుకోని విపత్తుల వల్ల, ప్రమాదవశాత్తు రుణం తీసుకున్న సభ్యురాలు మరణిస్తే రుణాన్ని మాఫీ చేయడంతో పాటు శ్రీనిధి ద్వారా రూ.10 లక్షల ప్రమాద బీమా పరిహారాన్ని సైతం ప్రభుత్వపరంగా అందజేస్తున్నామన్నారు.
ఈ నేపథ్యంలోనే మల్యాల మండల కేంద్రంలోని వాయుపుత్ర వివో పరిధిలోని శివ సాయి గ్రూపునకు చెందిన సభ్యురాలు గడ్డం రాజకుమారి అలియాస్ ఆగంతం రాజకుమారి గత మార్చి 25న రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. రాజకుమారి మృతి చెందడంతో రాజకుమారి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా పరిహారమును శ్రీనిధి ద్వారా రూ.10 లక్షల పరిహారాన్ని అందజేయడంతో పాటు శ్రీనిధి ద్వారా రూ.2లక్షల రుణం తీసుకోగా రాజకుమారి చెల్లించగా పోను రూ.1,89,292 రుణాన్ని సైతం రుణమాఫీ రూపంలో మాఫీ చేశామన్నారు.
ఇందుకు సంబంధించిన రెండు చెక్కులను మృతురాలి కుటుంబ సభ్యులైన గడ్డం లక్ష్మీనారాయణకు చెక్కులను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి అధికారి రాం నారాయణ, మండల తహసీల్దార్ వసంత, ఎంపీడీవో స్వాతి, ఐకేపీ ఏపీఎం చినరాజయ్య, సీఐ నీలం రవి, నాయకులు ముత్యాల రామలింగారెడ్డి, దొంగ ఆనందరెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, ముత్యం శంకర్, దారం ఆదిరెడ్డి, నేరెళ్ల సతీష్ రెడ్డి, నక్క అనిల్, ప్రకాష్ రెడ్డ, అగంతం వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.