గన్నేరువరం, డిసెంబర్ 9: గ్రామాల్లోని నర్సరీల్లో నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు సిద్ధం చేయాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. గురువారం మండలంలోని జంగపెల్లి, హన్మాజీపల్లి, మైలారం గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు. మైలారం గ్రామంలో మహిళా రైతు నిర్వహిస్తున్న పాలీహౌస్లోని చామంతి తోటను సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే మొక్కలను పెంచే నర్సరీల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. మొక్కల పెంపునకు మొదట నర్సరీల్లో బ్యాగుల్లో మట్టిని నింపే పని పూర్తి చేసి, విత్తనాలు నాటేందుకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే మొక్కలను ఎండ నుంచి సంరక్షించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా నర్సరీ నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మైలారంలోని చామంతి తోట పెట్టిన మహిళా రైతును అదనపు కలెక్టర్ అభినందించారు. యాసంగిలో వరికి బదులు వివిధ రకాల తోటలు, కూరగాయలను సాగు చేయడం ఎంతో మేలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఏపీడీ సంధ్యారాణి, ఎంపీడీవో స్వాతి, ఏపీవో విజయ, సర్పంచులు అటికం శారద, లింగాల రజిత, దుడ్డు రేణుక, పంచాయతీ కార్యదర్శులు లచ్చయ్య, కవిత, తిరుపతి, నాయకుడు అటికం శ్రీనివాస్, మహిళా రైతు ముత్యాల రజనీరెడ్డి తదితరులు ఉన్నారు.